లండన్: నిప్పులు చెరిగే వేగం.. పచ్చని పిచ్‌పై బుల్లెట్‌లా దూసుకొచ్చే బంతులు... కళ్లు చెదిరే స్వింగ్.. ముట్టుకుంటే బ్యాట్‌ను ముద్దాడుతూ గాల్లోకి లేచే బంతి. ఈ మాటలన్నీ ఇంగ్లండ్ పేస్ బౌలర్ జేమ్స్ అండర్సన్‌కు సరితూగుతాయి. కోహ్లి సేన టెస్టు సిరీస్ ఓడిపోవడానికి జిమ్మీ కూడా ముఖ్య కారణం. టీమిండియా బ్యాట్స్‌మెన్ క్రీజులో కుదురుకున్నారని భావించిన ప్రతీసారి ఇంగ్లండ్ సారథి జోయ్ రూట్ అండర్సన్ చేతికి బంతిని అప్పగించే వాడు. కెప్టెన్ తనపై ఉంచిన నమ్మకాన్ని ప్రతీసారి నిలబెట్టుకున్నాడు అండర్సన్. ఈ సిరీస్‌లో తాను ఎందుకు నంబర్ వన్ బౌలరో ప్రపంచానికి చాటి చెప్పాడు.
అండర్సన్ బౌలింగ్ ధాటికి వికెట్లు, రికార్డులు తన ఖాతాలో వచ్చి చేరాయి. ఓవల్ మైదానంలో భారత్ పేసర్ మహ్మద్ షమీ వికెట్ తీయడంతో టెస్టులో అత్యధిక వికెట్లు(564) తీసిన పేస్ బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో ఆసీస్ దిగ్గజ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్(563) రికార్డును సవరించాడు. ఇక ఓవరాల్‌గా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో శ్రీలంక స్పిన్ మాంత్రికుడు మురళీథరన్(800), ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్(708), టీమిండియా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే(619) తొలి మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. 2003లో జింబాబ్వేపై టెస్టుల్లో అరంగేట్రం చేసిన అండర్సన్ అనతికాలంలోనే ప్రధాన బౌలర్‌గా ఎదిగాడు. ప్రస్తుతం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అండర్సన్ ఆగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment