
గోవాపై ఆంధ్ర గెలుపు
సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలో ఆంధ్ర 6 వికెట్ల తేడాతో గోవాపై విజయం సాధించింది.
చెన్నై: సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలో ఆంధ్ర 6 వికెట్ల తేడాతో గోవాపై విజయం సాధించింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆంధ్ర ఓపెనర్ అశ్విన్ హెబ్బర్ (52 బంతుల్లో 83 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) ఇన్నింగ్స్ కడదాకా నిలిచి జట్టును గెలిపించాడు. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేపట్టిన గోవా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఓపెనర్ స్వప్నిల్ అస్నోడ్కర్ (54 బంతుల్లో 75; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించాడు.
అయ్యప్ప, స్టీఫెన్, షోయబ్, భార్గవ్ తలా ఒక వికెట్ తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఆంధ్ర 15 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో అశ్విన్ వీరోచిత ప్రదర్శనతో ఆంధ్ర 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రవితేజ 32 పరుగులు చేశాడు. తమిళనాడుతో జరిగిన మరో లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 72 పరుగుల తేడాతో గెలిచింది.