'ఐపీఎల్ భవిష్యత్తును నిర్ణయించండి'
న్యూఢిల్లీ: ఇటీవల ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కు వ్యతిరేకంగా అనేక కామెంట్లు రావడంతో ఆ లీగ్ ను సక్రమంగా నిర్వహించడానికి రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లు సహకరించాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. ఐపీఎల్ అనేది హాస్యాస్పద టోర్నీగా మారిపోయిందంటూ వెలుగు చూసిన వ్యాఖ్యలపై అనురాగ్ ఠాకూర్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర క్రికెట్ అసోసిషియేషన్లకు లేఖ రాశారు.
' ఐపీఎల్ భవిష్యత్తును నిర్ణయించాల్సింది రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లే. గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ లీగ్ ద్వారా రాష్ట్ర అసోసియేషన్లకు రూ.2, 406 కోట్లు లభించింది. ఆయా అసోసియేషన్లు క్రికెట్ ను మరింతగా అభివృద్ది చేసుకోవడానికి ఐపీఎల్ ఆదాయం ఎంతగానో ఉపయోగపడింది. ఐపీఎల్ ద్వారా మాజీ క్రికెటర్ల వన్ టైమ్ బెన్ ఫిట్ కింద రూ.110 కోట్లు మొత్తాన్ని బీసీసీఐ అందజేసింది. అలా లబ్ది పొందిన వారు ప్లాటినం జూబ్లీస్కీంలో లేని మాజీ క్రికెటర్లే. దాంతో పాటు భారతదేశ వృద్ధి రేటు అభివృద్ధిలో కూడా ఈ లీగ్ పాత్ర ఉంది. ఈ లీగ్ ద్వారా 2,244 కోట్లను పలు రకాలైన పన్నులు కట్టాం. ఈ లీగ్ భవిష్యత్తు రాష్ట్ర అసోసియేషన్లపైనే ఆధారపడి వుంది'అని అనురాగ్ తన లేఖలో పేర్కొన్నారు.