అనురాగ్ పై లలిత్ మోదీ తీవ్ర వ్యాఖ్యలు
లండన్:ఆర్థిక నేరారోపణలతో దేశం విడిచి పారిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనురాగ్ ఠాకూర్ కు సంబంధించిన క్రికెటింగ్ పత్రాలు నకిలీవంటూ లలిత్ మోడీ విమర్శించారు. అసలు భారత క్రికెట్ లో ఫిక్సర్లు ఎవరైనా ఉన్నారంటే అది బోర్డు అధ్యక్షుడు అనురాగేనని ధ్వజమెత్తారు.
లోధా కమిటీ సిఫారుసుల అమలు విషయంలో ఇప్పటికే బీసీసీఐ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుంటే లలిత్ మోదీ ఆ అంశాన్ని తన ఆయుధంగా చేసుకుని అనురాగ్ పై విమర్శలు గుప్పించారు. ఒక సెలక్టర్ కావడానికి కేవలం ఒకే రంజీ ట్రోఫీ గేమ్ ఎలా ఆడావో అనే దానిపై సమాధానం తెలుసుకోవాలనుకుంటున్నావా?అని లలిత్ చమత్కరించారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డులో అనురాగ్ రియల్ ఫిక్సర్ అయితే, ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా ఒక మోసగాడంటూ లలిత్ మోదీ విమర్శించారు.