
నిఖత్ ‘పసిడి’ పంచ్
వోజ్‌వొదినా (సెర్బియా): తన విజయపరంపర కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ బాక్సర్ నిఖత్ జరీన్ అంతర్జాతీయ స్థాయిలో మరోసారి పసిడి పంచ్ విసిరింది. నేషన్స్ కప్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో నిఖత్ స్వర్ణం చేజిక్కించుకుంది. ఆదివారం ఇక్కడ జరిగిన యూత్ బాలికల విభాగం 51 కేజీల కేటగిరీ ఫైనల్లో నిఖత్ 3-0 పాయింట్ల తేడాతో పల్త్‌సెవా ఎకతెరీనా (రష్యా)ను చిత్తు చేసింది.
ఈ టోర్నమెంట్‌లో నిఖత్ తన ప్రత్యర్థులకు ఒక్క పాయింట్ కూడా సమర్పించుకోకపోవడం విశేషం. 2010లో జాతీయ బెస్ట్ బాక్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్న 17 ఏళ్ల జరీన్ ఆ తర్వాత తన ప్రదర్శనను మరింత మెరుగు పర్చుకుంది. మూడేళ్ల క్రితం జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన ఈ నిజామాబాద్ బాక్సర్ గత కొంత కాలంగా నిలకడగా రాణిస్తోంది. గత సెప్టెంబర్‌లో బల్గేరియాలో జరిగిన మహిళల యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో కూడా రజతం సాధించి నిఖత్ సంచలనం సృష్టించింది.