అరంగేట్రంలోనే అద్భుతం  | Argentina 1-1 Iceland | Sakshi
Sakshi News home page

అరంగేట్రంలోనే అద్భుతం 

Published Sun, Jun 17 2018 1:18 AM | Last Updated on Sun, Jun 17 2018 1:18 AM

Argentina 1-1 Iceland - Sakshi

మెస్సీని నిలువరిస్తున్న ఐస్‌లాండ్‌ ఆటగాళ్లు

ఆడుతున్నది ప్రపంచ కప్‌లో తొలి మ్యాచ్‌... ప్రత్యర్థి దిగ్గజం... అయినా ఐస్‌లాండ్‌ అదరలేదు... బెదరలేదు! విపరీతమైన దాడులు ఎదురైనా, బంతి ఎక్కువసేపు తమ ఆధీనంలో లేకున్నా దీటుగా నిలిచింది. మెస్సీలాంటి మహామహుడున్న అర్జెంటీనాను నిలువరించింది. అద్భుత ఆటతో అరంగేట్ర మ్యాచ్‌ను చిరస్మరణీయం చేసుకుంది. మరోవైపు మెస్సీ పెనాల్టీ కిక్‌ను వృథా చేసి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు.  

మాస్కో: ఫుట్‌బాల్‌ పసికూన ఐస్‌లాండ్‌ తమ తొలి ప్రపంచ కప్‌ను ఘనంగా ప్రారంభించింది. కొండలాంటి అర్జెంటీనాతో తలపడుతున్నా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో ఆడింది. సులువుగా గెలిచేస్తుందనుకున్న లియోనల్‌ మెస్సీ జట్టుకు చుక్కలు చూపింది. శనివారం ఇక్కడ జరిగిన గ్రూప్‌ ‘డి’ మ్యాచ్‌లో దుర్బేధ్యమైన డిఫెన్స్‌తో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టి 1–1తో డ్రా చేసుకుంది. ఈ ఫలితం ఐస్‌లాండ్‌కు విజయంతో సమానం కాగా, ఓడకపోయినా అర్జెంటీనాకు మింగుడుపడని పరిణామమే. ఆ జట్టు కెప్టెన్, స్టార్‌ ఆటగాడు లియోనల్‌ మెస్సీ ఎన్నడూ లేనంతగా ఏకంగా 11 సార్లు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడి చేసినా ఒక్కసారీ విజయవంతం కాలేకపోవడం గమనార్హం. ఓ పెనాల్టీ కిక్‌తో పాటు మెస్సీని అన్నిసార్లు అడ్డుకున్న ఐస్‌ల్యాండ్‌ గోల్‌ కీపర్‌ హాన్స్‌ హాల్డర్‌సన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పురస్కారం దక్కింది.
 
రెండూ మొదటి భాగంలోనే... 
అర్జెంటీనా స్థాయి జట్టు ఏ క్షణంలోనైనా విరుచుకుపడే ప్రమాదం ఉంటుందని భావించిన ఐస్‌లాండ్‌ రక్షణాత్మక ఆటను ఎంచుకుని మ్యాచ్‌లో ఒక్కడే ఫార్వర్డ్‌ ప్లేయర్‌తో బరిలో దిగింది. దీనికి తగ్గట్లే, మెస్సీ నుంచి రెండు ఫ్రీ కిక్‌లు ఎదురై ప్రారంభం కఠినంగానే సాగినా వెంటనే కోలుకుంది. ఇదే సమయంలో ఆ జట్టుకూ  అవకాశం వచ్చినా సఫలం కాలేదు. అనూ హ్యంగా మెస్సీ ఒత్తిడిలో పడటంతో అర్జెంటీనాకూ పైచేయి చిక్కలేదు. అయితే, క్రమంగా అటాకింగ్‌ గేమ్‌లోకి దిగింది. దీని ఫలితం 19వ నిమిషంలోనే కనిపించింది. మార్కస్‌ రోజో అందించిన క్రాస్‌ పాస్‌ను బాక్స్‌ ఏరియా నుంచి కున్‌ అగ్యురో అద్భుతమైన రీతిలో  గోల్‌పోస్ట్‌లోకి పంపాడు. ఈ ఆధిక్యాన్ని ఆస్వాదించే లోపే ఒక్కసారిగా మెస్సీ జట్టుకు షాక్‌ తగిలింది. అర్జెంటీనా డిఫెన్స్‌లోని అనిశ్చితిని సొమ్ము చేసుకుంటూ 23వ నిమిషంలో ఫిన్‌బొగాసన్‌ ఐస్‌లాండ్‌కు చరిత్రాత్మక గోల్‌ అందించాడు. అప్పటికీ మెస్సీ బృందం అప్రమత్తమై దాడులతో ఆధిపత్యానికి ప్రయత్నించింది. ఐస్‌లాండ్‌ డిఫెన్స్‌ను ఛేదించలేక ఫలితం రాబట్టలేకపోయింది. 

పట్టు వదల్లేదు...
అత్యుత్తమ ఆటతో తొలి భాగంలో అర్జెంటీనాను కాచుకుని నిలిచిన ఐస్‌లాండ్‌... రెండో భాగంలోనూ పట్టుదల చూపింది. ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌ వరకు వెళ్లలేకపోయినా, వారి డిఫెన్స్‌ బలహీనతను సొమ్ము చేసుకుంటూ దూకుడు చూపింది. అయితే 63వ నిమిషంలో ఆ జట్టు ఆటగాడు మాగ్నసన్‌ కారణంగా అర్జెంటీనాకు పెనాల్టీ కిక్‌ లభించింది. దీనిని మెస్సీ పేలవంగా కొట్టగా... గోల్‌ కీపర్‌ హాల్డర్‌సన్‌ కుడి వైపునకు ఒరిగిపోతూ అడ్డుకున్నాడు. ఉపేక్షిస్తే గెలుపు దక్కే పరిస్థితి లేదని భావించిన అర్జెంటీనా... జోరు పెంచి ప్రత్యర్థిని ఒత్తిడికి గురిచేసింది. అయినా ఐస్‌లాండ్‌ డిఫెన్స్‌ను దెబ్బతీయలేకపోయింది. వ్యూహం మార్చిన మెస్సీ దూరం నుంచి గోల్‌కు ప్రయత్నించినా, కీలక ఆటగాడైన హిగుయెన్‌ను 84వ నిమిషంలో బరిలో దింపినా ఇవేమీ ఐస్‌లాండ్‌ రక్షణ శ్రేణిని ఛేదించలేకపోయాయి. ఇంజ్యూరీ సమయం (90+5) ఆఖర్లో వచ్చిన ఫ్రీ కిక్‌నూ మెస్సీ సద్వినియోగం చేయలేకపోయాడు. దీంతో మ్యాచ్‌ 1–1తో డ్రా అయింది. గెలుపు చిక్కకపోయినా... బంతిని ముప్పావు వంతు ఆధీనంలో ఉంచుకోవడం, తీవ్రంగా దాడులకు దిగడం వంటివి అర్జెంటీనాకు ఉపశమనం కలిగించాయి.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement