‘మన్కడింగ్‌’ రేపిన దుమారం  | Ashwin Mankading: Stop judging him already, hei s not a disgrace | Sakshi
Sakshi News home page

‘మన్కడింగ్‌’ రేపిన దుమారం 

Published Wed, Mar 27 2019 1:22 AM | Last Updated on Wed, Mar 27 2019 1:22 AM

Ashwin Mankading: Stop judging him already, hei s not a disgrace - Sakshi

జైపూర్‌: ఐపీఎల్‌ మ్యాచ్‌లో రాజస్తాన్‌ బ్యాట్స్‌మన్‌ బట్లర్‌ను ‘మన్కడింగ్‌’ ద్వారా ఔట్‌ చేసి పంజాబ్‌ కెప్టెన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కొత్త వివాదాన్ని తెర మీదకు తెచ్చాడు. అతను నిబంధనల ప్రకారమే వ్యవహరించాడంటూ కొందరు మద్దతు పలుకుతుండగా... భారత టాప్‌ స్పిన్నర్‌ చేసింది తప్పేనంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. అయితే తాజా ఘటనపై అశ్విన్‌ మాత్రం మొదటి నుంచీ ఒకే మాటకు కట్టుబడి ఉన్నాడు. తాను చేసిన దాంట్లో తప్పేమీ లేదని అతను మ్యాచ్‌ తర్వాత కూడా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడాడు. ‘నేను అలా ఔట్‌ చేయాలని వ్యూహం ఏమీ రచించుకోలేదు. అది అప్పటికప్పుడు జరిగిపోయిందంతే. నిబంధనలకు అనుగుణంగానే నేను వ్యవహరించాను. క్రీడా స్ఫూర్తి అనే మాటను ఎందుకు ముందుకు తెస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. స్ఫూర్తికి విరుద్ధమని భావిస్తే నిబంధనలే మార్చేయండి. ఎప్పుడో 1987  ప్రపంచకప్‌లో జరిగిన ఘటనతో దీనిని పోల్చవద్దు. నాటి మ్యాచ్‌లో నేను గానీ బట్లర్‌ గానీ ఆడలేదు. బంతి వేసే సమయంలో కావాలని ఆలస్యం చేశాననే మాటను కూడా నేను అంగీకరించను. అతను అప్పటికే ముందుకు వెళ్లిపోయాడు’ అని అశ్విన్‌ వివరణ ఇచ్చాడు. 2012లో బ్రిస్బేన్‌లో జరిగిన వన్డేలో కూడా అశ్విన్‌ ఇదే తరహాలో తిరిమన్నెను ఔట్‌ చేయగా... భారత తాత్కాలిక కెప్టెన్‌ సెహ్వాగ్‌ తమ అప్పీల్‌ను వెనక్కి తీసుకోవడంతో తిరిమన్నె బ్యాటింగ్‌ కొనసాగించాడు. 2014లో ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన వన్డేలో బట్లర్‌ను ఇదే రీతిలో సేననాయకే మన్కడింగ్‌ చేశాడు. మరోవైపు గతంలో జరిగిన ఐపీఎల్‌ కెప్టెన్ల సమావేశంలో మన్కడింగ్‌ చేయరాదంటూ నిర్ణయం తీసుకున్నామంటూ మాజీ చైర్మన్‌ రాజీవ్‌ శుక్లా గుర్తు చేయగా... అది నిబంధనలు మారక ముందు జరిగిన సమావేశమని బోర్డు అధికారి ఒకరు స్పష్టం చేశారు.  

మన్కడింగ్‌ అంటే..: క్రికెట్‌ నిబంధనలు రూపొందించే ఎంసీసీ ప్రకారం... బౌలర్‌ బంతిని వేయడానికి సిద్ధమై, అతని చేతినుంచి ఇంకా బంతి వెళ్లక ముందే నాన్‌స్ట్రైకర్‌ క్రీజ్‌ దాటి బయటకు వస్తే బెయిల్స్‌ను పడగొట్టి బౌలర్‌ సదరు బ్యాట్స్‌మన్‌ ఔట్‌ కోసం అప్పీల్‌ చేయవచ్చు. ఇది సాంకేతికంగా రనౌట్‌ జాబితాలో వస్తుంది. 2017 అక్టోబర్‌ 1నుంచి అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం బౌలర్‌ బంతిని విసిరే లోగా ఏ సమయంలోనైనా నాన్‌స్ట్రైకర్‌ క్రీజ్‌ బయట ఉంటే ఔట్‌గానే పరిగణిస్తారు. నిబంధల ప్రకారం అశ్విన్‌ చేసింది సరైందే. క్రీడా స్ఫూర్తి ప్రకారం బ్యాట్స్‌మన్‌ను ఔటే చేసే ముందు ఒక సారి హెచ్చరిస్తే బాగుంటుందని అంటారు కానీ నిబంధనల్లో ఎక్కడా ముందుగా హెచ్చరించాలని లేదు. 1947లో సిడ్నీ టెస్టులో ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ బ్రౌన్‌ను భారత ఆల్‌రౌండర్‌ వినూ మన్కడ్‌ ఇలా ఔట్‌ చేయడంతో ‘మన్కడింగ్‌’ అని పేరు వచ్చింది. 

అశ్విన్‌ చేసిన పని అతను ఎలాంటివాడో చెబుతుంది. పంజాబ్‌ జట్టు సభ్యుల కళ్లలోకి నేను చూసినప్పుడు అపరాధ భావం కనిపించింది. అలా చేయడం సరైందో కాదో అభిమానులే నిర్ణయిస్తారు.’  – రాజస్తాన్‌ కోచ్‌ ప్యాడీ ఆప్టన్‌ 

ఒక వ్యక్తిగా, కెప్టెన్‌గా అశ్విన్‌ చేసిన పని నిరాశ కలిగించింది. అశ్విన్‌ కావాలనే బంతి వేయకుండా ఆగిపోయాడు. దానిని డెడ్‌బాల్‌గా ప్రకటించాల్సింది. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధం.  – వార్న్, మాజీ క్రికెటర్‌ 

నిబంధనలు ఉన్నాయి. మైదానంలో కెమెరాలూ ఉన్నాయి. నాకు కుప్పలు తెప్పలుగా మెసేజ్‌లు పంపడం ఆపండి. ఏదైనా ఉంటే అశ్విన్‌ టైమ్‌లైన్‌లో చేసుకోండి. దీనికంటే నా సౌందర్యపోషణ గురించి, లిప్‌స్టిక్‌ షేడ్‌ గురించి అడుగుతున్నవారే నయం.’ – అశ్విన్‌ భార్య ప్రీతి అసహనం 

క్రీడాస్ఫూర్తి గురించి అశ్విన్‌కు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. అంతా రూల్స్‌ ప్రకారమే జరిగింది. ఏదైనా తప్పు ఉంటే అంపైర్లు, రిఫరీ చూసుకుంటారు. అశ్విన్‌కు నియమాలు ఏమిటో వాటిని ఎలా వాడుకోవాలో బాగా తెలుసు.’  – బీసీసీఐ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement