
రైనా, ఇషాంత్‌లపై వేటు
కొంతకాలంగా ఘోరంగా విఫలమవుతున్నా జట్టులో స్థానం కాపాడుకుంటున్న సురేశ్ రైనా, ఇషాంత్ శర్మలపై వేటు పడింది. ఆసియాకప్ వన్డే టోర్నీ కోసం ఎంపిక చేసిన జట్టులో ఈ ఇద్దరికీ చోటు దక్కలేదు.
బెంగళూరు : కొంతకాలంగా ఘోరంగా విఫలమవుతున్నా జట్టులో స్థానం కాపాడుకుంటున్న సురేశ్ రైనా, ఇషాంత్ శర్మలపై వేటు పడింది. ఆసియాకప్ వన్డే టోర్నీ కోసం ఎంపిక చేసిన జట్టులో ఈ ఇద్దరికీ చోటు దక్కలేదు.
మరోవైపు టెస్టు స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న చతేశ్వర్ పుజారాను మళ్లీ వన్డే జట్టులోకి ఎంపిక చేశారు. పుజారా గతంలో జింబాబ్వేలో రెండు వన్డేలు ఆడాడు. ఇవి మినహా న్యూజిలాండ్‌లో ఆడిన వన్డే జట్టులో సభ్యులందరినీ కొనసాగించారు. మరోవైపు టి20 ప్రపంచకప్ జట్టులోనూ పెద్దగా సంచలనాలేమీ లేవు. యువరాజ్ సింగ్, రైనాలను ఇందులో కొనసాగించారు.
కర్ణాటక ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ వన్డే, టి20 రెండు జట్లలోనూ ఎంపిక కాగా... హైదరాబాదీ రాయుడుని కేవలం వన్డేలకు పరిమితం చేశారు. ఇక గంభీర్, హర్భజన్‌లను పట్టించుకోలేదు. వన్డే జట్టులో పేసర్ ఈశ్వర్ పాండేకు స్థానం కల్పించి... టి20ల్లో మాత్రం తన స్థానంలో మోహిత్ శర్మను తీసుకున్నారు.
ఆసియాకప్ ఫిబ్రవరి 25 నుంచి మార్చి 8 వరకు; టి20 ప్రపంచకప్ మార్చి 16 నుంచి ఏప్రిల్ 6 వరకు బంగ్లాదేశ్‌లో జరుగుతాయి.
ఆసియాకప్‌కు భారత జట్టు: ధోని (కెప్టెన్), ధావన్, రోహిత్, కోహ్లి, పుజారా, రాయుడు, రహానే, జడేజా, అశ్విన్, భువనేశ్వర్, షమీ, ఆరోన్, బిన్నీ, ఈశ్వర్ పాండే, అమిత్ మిశ్రా.
టి20 ప్రపంచకప్‌కు భారత జట్టు: ధోని (కెప్టెన్), ధావన్, రోహిత్, కోహ్లి, రైనా, యువరాజ్, రహానే, జడేజా, అశ్విన్, భువనేశ్వర్, షమీ, బిన్నీ, అమిత్ మిశ్రా, ఆరోన్, మోహిత్ శర్మ.