
సైనా, సింధులపై ఆశలు
ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (ఏబీసీ) మంగళవారం ప్రారంభమవుతుంది.
నేటి నుంచి ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
వుహాన్ (చైనా): ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (ఏబీసీ) మంగళవారం ప్రారంభమవుతుంది. మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ సైనా నెహ్వాల్, ఎనిమిదో సీడ్ పీవీ సింధులపైనే భారత్ పతకావకాశాలు ఆధారపడి ఉన్నాయి. తొలి రౌండ్‌లో ‘బై’... రెండో రౌండ్‌లో తలపడాల్సిన ప్రత్యర్థి వైదొలగడంతో సైనా నెహ్వాల్ నేరుగా మూడో రౌండ్‌లో ప్రపంచ 10వ ర్యాంకర్ నోజోమి ఒకుహారా (జపాన్)తో మ్యాచ్ ఆడనుంది. తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన సింధు రెండో రౌండ్‌లో అనైత్ ఖుర్షుద్యాన్ (ఉజ్బెకిస్థాన్)తో తలపడుతుంది. ఈ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరుకుంటే కనీసం కాంస్య పతకాలు ఖాయమవుతాయి. గతంలో సైనా (2010), సింధు (2014) ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌కు కాంస్య పతకాలు అం దించారు.
మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్ ఆశలన్నీ పారుపల్లి కశ్యప్‌పైనే ఉన్నాయి. ప్రపంచ నాలుగో ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్ ప్రణయ్ ఈ టోర్నీ నుంచి చివరి నిమిషంలో వైదొలిగారు. మంగళవారం జరిగే తొలి రౌండ్‌లో ప్రపంచ 48వ ర్యాంకర్ జీ లియాంగ్ డెరెక్ వోంగ్ (సింగపూర్)తో ప్రపంచ 14వ ర్యాంకర్ కశ్యప్ తలపడతాడు. ఈ పోటీల్లో భారత్ తరఫున 1965లో దినేశ్ ఖన్నా స్వర్ణం, 2007లో అనూప్ శ్రీధర్ కాంస్యం గెలిచారు.