
భళా.. భారత్
క్వాంటన్ (మలేసియా): ‘పాకిస్తాన్ చేతిలో ఓడి ఎట్టి పరిస్థితుల్లోనూ భారత సైనికులను నిరాశపరచనివ్వం. ముఖ్యంగా సరిహద్దు దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్ల కోసమైనా గెలిచి తీరుతాం’ గత నెలలో భారత హాకీ జట్టు కెప్టెన్ పీఆర్ శ్రీజేష్ చేసిన ప్రతిజ్ఞ ఇది. అన్నమాట నిలబెట్టుకుంటూ మన హాకీ వీరులు ఆసియా చాంపియన్‌స ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను 3-2తో చిత్తు చేశారు. తద్వారా సైనికుల్నే కాకుండా యావద్భారతాన్ని ఆనందంలో ముంచెత్తారు.
తమ మూడో రౌండ్ రాబిన్ లీగ్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున ప్రదీప్ మోర్ (22వ నిమిషంలో), రూపిందర్ పాల్ సింగ్ (43వ ని.లో), రమణ్‌దీప్ సింగ్ (44వ ని.లో) గోల్స్ చేశారు. పాక్ నుంచి ముహమ్మద్ రిజ్వాన్ సీనియర్ (31వ ని.లో), ముహమ్మద్ ఇర్ఫాన్ జూనియర్ (39వ ని.లో) గోల్స్ సాధించారు. ఈనెల 25న జరిగే తదుపరి లీగ్ మ్యాచ్‌లో చైనాతో భారత్ ఆడుతుంది.
ఆరంభంలో తడబడినా..
మ్యాచ్ ఆరంభంలో భారత ఆటగాళ్లు తమ స్థారుుకి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేదు. శ్రీజేష్ బృందం తీవ్ర ఒత్తిడితో బరిలోకి దిగడంతో తొలి క్వార్టర్‌లో ప్రత్యర్థి పాక్ పైచేరుు సాధించింది. వారి డిఫెండర్లు మెరుగ్గా రాణించడంలో భారత్‌కు గోల్స్ చేసే అవకాశం చిక్కలేదు. అటు పాక్‌కు లభించిన రెండు పెనాల్టీ కార్నర్ అవకాశాలను గోల్ కీపర్ శ్రీజేష్ తిప్పికొట్టాడు. రెండో క్వార్టర్‌లో భారత్ క్రమశిక్షణగా ఆడింది. మిడ్‌ఫీల్డ్‌లో ఒత్తిడి పెంచుతూ 22వ నిమిషంలో బోణీ చేసింది. రూపిందర్‌పాల్ నుంచి లాంగ్ షాట్ అందుకున్న ఎస్‌కే ఉతప్ప సహచరుడు ప్రదీప్‌కు పాస్ ఇవ్వగా తను జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు.
ద్వితీయార్ధంలో ఎదురుదాడికి దిగిన పాక్ మరో తొమ్మిది నిమిషాల్లోనే ఫలితం సాధించింది. రిజ్వాన్ సీనియర్ గోల్‌తో స్కోరు సమమైంది. మరింత జోరును కనబరుస్తూ పాక్ 39వ నిమిషంలో రెండో గోల్ చేయడంతో భారత్ వెనుకబడింది. ఈ దశలో భారత్ కాస్త ఒత్తిడికి లోనయినా నిమిషం వ్యవధిలోనే రెండు గోల్స్‌తో విరుచుకుపడి పాక్‌ను కోలుకోలేకుండా చేసింది. 43వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ ద్వారా డ్రాగ్‌ఫ్లికర్ రూపిందర్ పాల్ సింగ్ గోల్ చేయగా మరో నిమిషంలో రమణ్‌దీప్ ఫీల్డ్ గోల్‌తో అదరగొట్టాడు. ఇక చివరి క్వార్టర్‌లో భారత్ చక్కడి డిఫెన్సివ్ ఆట కనబరచడంతో పాక్ ప్రయత్నాలు వృథా అయ్యాయి.