
హరికృష్ణ, హారికలకు రజతాలు
షార్జా: ఆసియా బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు పెంటేల హరికృష్ణ, ద్రోణవల్లి హారిక ఆకట్టుకున్నారు. శనివారం జరిగిన ఈ టోర్నీ ఓపెన్ విభాగంలో హరికృష్ణకు రజత పతకం దక్కగా... మహిళల విభాగంలో హారిక రజతం గెలుచుకుంది. మొత్తం 9 రౌండ్ల ద్వారా 7 పాయింట్లు సాధించిన హరికృష్ణ రెండో స్థానంలో నిలిచాడు. యు యాంగ్యీ (చైనా)కి స్వర్ణం లభించింది.
ఏడో రౌండ్ ముగిసే సరికి అగ్రస్థానంలో కొనసాగిన ఏడో సీడ్ హరి, ఎనిమిదో రౌండ్‌లో గుయెన్ సన్ (వియత్నాం) చేతిలో పరాజయం పాలై వెనుకబడ్డాడు. అయితే 9వ రౌండ్‌లో భారత్‌కే చెందిన విదిత్ గుజరాతీని ఓడించడంతో హరికి రెండో స్థానం దక్కింది. మహిళల విభాగంలో 9 రౌండ్ల అనంతరం 6.5 పాయింట్లు సాధించిన హారిక రజతం దక్కించుకుంది. ఆఖరి రౌండ్‌లో హోంగ్ ట్రామ్ (వియత్నాం)పై విజయం సాధించడంతో హారికకు రెండో స్థానం ఖాయమైంది. టాన్ జోంగ్యి (చైనా- 8 పాయింట్లు) స్వర్ణం గెలుచుకోగా, 6.5 పాయింట్లతో హారికతో సమంగా నిలిచిన అబ్దుమ్ అలిక్ (కజకిస్థాన్)కు కాంస్యం లభించింది.
లలిత్‌కు తొలి గెలుపు
మరోవైపు ఆదివారం జరిగిన క్లాసిక్ ఓపెన్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబు తొలి విజయం సాధించాడు. అహ్మద్ నజర్‌తో జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన లలిత్ 40 ఎత్తుల్లో గెలిచాడు. ఈ టోర్నీలో లలిత్‌కిదే తొలి గెలుపు. అంతకుముందు తొలి రెండు రౌండ్‌లను ‘డ్రా’ చేసుకున్న అతను మూడో రౌండ్‌లో ఓడిపోయాడు. నాలుగో రౌండ్ తర్వాత లలిత్ రెండు పాయింట్లతో మరో 15 మందితో కలిసి ఉమ్మడిగా నాలుగో స్థానంలో ఉన్నాడు.