⇒ వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ నిర్మించిన నేను ఫీచర్ ఫిల్మ్ చేయాలనుకున్న టైమ్‌లో అంకిత్ ద్వారా ‘కమిటీ కుర్రోళ్ళు’ కథ నా వద్దకు వచ్చింది. ఈ కథ నాకు, మా నాన్నకి బాగా నచ్చింది. సిటీలో పుట్టి పెరిగిన నేను జాతర అనుభూతిని పొందలేదు. ఈ కథలో నాకు కళ్లకు కట్టినట్టుగా వంశీ చూపించాడు. అందుకే ఈ కథతో ఎలాగైనా సినిమా నిర్మించాలని ఫిక్స్ అయి, తీశాను. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే జాతర చుట్టూ ఈ కథను రాశాడు వంశీ. మూడు తరాలను చూపించేలా ఈ కథ ఉంటుంది. నాకు నటించడమే ఇష్టం. నిర్మాత కావాలని ఎప్పుడూ అనుకోలేదు. ‘ముద్దపప్పు ఆవకాయ్’ టైమ్ నుంచి అలా జరిగిపోయిందంతే.
⇒ ప్రతిభ ఒక్కటే కాదు... క్రమశిక్షణ ఉంటేనే ఇండస్ట్రీలో ఎదుగుతామని చిరంజీవిగారు చెబుతుంటారు. ఆ క్రమశిక్షణ వంశీలో చూశాను. ఈ చిత్రంలోని పదకొండు మంది అబ్బాయిల పాత్రల్లో నన్ను నేను ఊహించుకున్నాను. ప్రతి ప్రేక్షకుడు ఏదో ఒక క్యారెక్టర్‌తో ప్రయాణం చేస్తాడు.
⇒ నా గురించి బయటివారు చేసే విమర్శలు, పొగడ్తల్ని పట్టించుకోను. నా గురించి నిజాయతీగా ఉన్నది ఉన్నట్లు (పొగడ్త అయినా, విమర్శ అయినా) చెప్పేది మా అమ్మానాన్న (పద్మజ, నాగబాబు), అన్నయ్యే (వరుణ్ తేజ్). ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాని మా అన్నయ్య, వదిన (లావణ్య త్రిపాఠి) చూశారు.. వాళ్లకి బాగా నచ్చింది. ప్రస్తుతం ఓ తమిళ చిత్రంలో నటిస్తున్నాను. అలాగే తెలుగులో ఓ వెబ్ సిరీస్ చేశాను.
‘‘మంచి కథలకే తొలిప్రాధాన్యం ఇస్తా. కథ బాగుండి నా పాత్రకిప్రాధాన్యం ఉంటే మిగతా అంశాలను పట్టించుకోను. చిన్న పాత్ర, చిన్న హీరో అని కూడా ఆలోచించను. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాననే ఆలోచన వల్లో.. వేరే ఏదైనా కారణమేమో తెలియదు కానీ తెలుగు దర్శకులు ఎక్కువగా నన్ను సంప్రదించడం లేదు. అయితే నాకు సౌకర్యంగా అనిపిస్తే ఎలాంటి పాత్రలు చేయడానికైనా రెడీ’’ అని నటి, నిర్మాత నిహారిక కొణిదెల అన్నారు. నూతన నటీనటులతో యదు వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. నిహారిక కొణిదెల సమర్పణలో శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజ్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వంశీ నందిపాటి రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిహారిక కొణిదెల చెప్పిన విశేషాలు.
Comments
Please login to add a commentAdd a comment