నాలుగోసారీ నగుబాటు
ఆసీస్ చేతిలో పాక్ మళ్లీ ‘వైట్‌వాష్’
• చివరి టెస్టులోనూ పరాజయం
• 220 పరుగులతో నెగ్గిన ఆసీస్
• 3–0తో సిరీస్ క్లీన్‌స్వీప్
సిడ్నీ: పోరాటమేమీ లేదు. అదే నిలకడలేమి. చివరి రోజు తొమ్మిది వికెట్లు చేతిలో ఉన్నా కూడా ‘డ్రా’ కోసం రోజంతా ఆడలేని స్థితిలో పాకిస్తాన్ జట్టు బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. 465 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన పాకిస్తాన్ శనివారం 80.2 ఓవర్లలో టీ విరామానికి ముందే 244 పరుగులకు కుప్పకూలింది. ఫలితంగా ఆస్ట్రేలియా జట్టు 220 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. అటు ఆసీస్ గడ్డపై పాకిస్తాన్ జట్టుకిది వరుసగా నాలుగో టెస్టు సిరీస్ ‘వైట్‌వాష్’ కావడం గమనార్హం.
సర్ఫరాజ్ అహ్మద్ (70 బంతుల్లో 72 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడడటంతో ఓటమి పరుగుల తేడా కాస్తయినా తగ్గింది. షర్జీల్ ఖాన్ (38 బంతుల్లో 40; 6 ఫోర్లు, 1 సిక్స్), మిస్బా ఉల్ హక్ (98 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్) çపర్వాలేదనిపించారు. పేసర్ హాజెల్‌వుడ్, స్పిన్నర్ స్టీవ్ ఓ కీఫ్ మూడేసి వికెట్లు తీయగా, మరో స్పిన్నర్ లియోన్ రెండు వికెట్లు పడగొట్టాడు. ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్... ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా డేవిడ్ వార్నర్ నిలిచాడు. ఈ రెండు జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్ ఈనెల 13 నుంచి 26 వరకు జరుగుతుంది.
టపటపా వికెట్లు...
ఓవర్‌నైట్ స్కోరు 55/1తో చివరి రోజు శనివారం తమ రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పాక్ తొలి సెషన్‌లోనే నాలుగు వికెట్లను కోల్పోయి తడబడింది. సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తున్న అజహర్ అలీ (11)ని ప్రారంభ ఓవర్‌లోనే హాజెల్‌వుడ్ రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్‌కు చేర్చాడు. సీనియర్ బ్యాట్స్‌మన్ యూనిస్ ఖాన్ (13) కూడా తక్కువ స్కోరుకే అవుట్ కావడంతో పాక్ 96 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో మిస్బా, అసద్ షఫీఖ్ (55 బంతుల్లో 30; 4 ఫోర్లు) కాసేపు క్రీజులో నిలదొక్కుకుని ఆరో వికెట్‌కు 40 పరుగులు జోడించారు. అనంతరం మిస్బాతో జత కట్టిన సర్ఫరాజ్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ జోడీ ఏడో వికెట్‌కు 52 పరుగులు జత చేసింది. ఇన్నింగ్స్ 80వ ఓవర్‌లో మూడు ఫోర్లు, ఓ సిక్స్‌తో చెలరేగిన తను 20 పరుగులు రాబట్టినా మరుసటి ఓవర్‌లోనే పాక్ తన చివరి వికెట్‌ను కోల్పోవడంతో పరాజయం పాలైంది.
4. ఆస్ట్రేలియా గడ్డపై పాక్‌కు ఇది వరుసగా నాలుగో వైట్‌వాష్. 1999–2000; 2004–2005; 2009–2010, 2016–2017 టెస్టు సిరీస్‌లలో పాక్ 0–3తో ఓడింది.
12.ఆస్ట్రేలియాలో పాకిస్తాన్ వరుస పరాజయాల సంఖ్య
4. సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా వచ్చి అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్ రికార్డును జాక్సన్ బర్డ్ (ఆస్ట్రేలియా) సమం చేశాడు. ఈ మ్యాచ్‌లో అతను నాలుగు క్యాచ్‌లు తీసుకున్నాడు. గతంలో గురుశరణ్ సింగ్ (భారత్–వెస్టిండీస్‌పై 1983లో), యూనిస్ ఖాన్ (పాకిస్తాన్–బంగ్లాదేశ్‌పై 2001లో), వీరేంద్ర సెహ్వాగ్ (భారత్–జింబాబ్వేపై 2002లో) కూడా నాలుగేసి క్యాచ్‌లు పట్టారు.
2. ఈ సిరీస్‌లో రెండు జట్ల బౌలర్లు ఒక్క ఇన్నింగ్స్‌లోనూ ఐదు వికెట్లు తీయలేకపోవడం గమనార్హం. మూడు అంతకన్నా ఎక్కువ టెస్టులు ఆడిన సిరీస్‌లో ఇలా జరగడం ఇది రెండోసారి మాత్రమే. చివరిసారి పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య 1964–1965 సీజన్‌లో ఇలా జరిగింది.