సిడ్నీ: భారత టెస్టు క్రికెట్ చరిత్రలో చిరకాలంగా పూర్తి కాని లక్ష్యాలలో ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ గెలవడం ఒకటి. అయితే కోహ్లి సేన గత పర్యటనలో (2018–19) దీనిని చేసి చూపించింది. 2–1తో సిరీస్ నెగ్గిన టీమిండియా ఈ ఘనత సాధించిన తొలి భారత జట్టుగా నిలిచింది. సహజంగానే ఈ ఫలితం ఆసీస్ జట్టు కోచ్ జస్టిన్ లాంగర్‌ను అమితంగా బాధించింది. తన కెరీర్‌లో విపరీతంగా బాధపడే క్షణాలలో ఇది ఒకటని అతను చెప్పుకున్నాడు. 2018 మార్చిలో బాల్ ట్యాంపరింగ్ ఉదంతం అనంతరం లాంగర్ జట్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టగా... ప్రధాన ఆటగాళ్లు స్మిత్, వార్నర్ లేకుండానే ఆసీస్ బరిలోకి దిగింది.
‘నా కోచింగ్ కెరీర్‌లో ఈ పరాజయం పెద్ద దెబ్బ. ఇది ఎప్పటికీ నన్ను వెంటాడుతుంది. నిజంగా నా జీవితంలో అది కఠిన సమయం. ఇంకా చెప్పాలంటే ఈ ఓటమి అందించిన కుదుపు మాకు మేలుకొలుపులాంటిది. ఆటగాడిగా 2001 యాషెస్ సిరీస్ ఆరంభంలో నన్ను తుది జట్టు నుంచి తప్పించినప్పుడు ఎంతగా బాధపడ్డానో ఇప్పుడు అదే తరహాలో బాధకు గురయ్యాను. అయితే నాడు యాషెస్ తర్వాత నా కెరీర్ అద్భుతంగా సాగింది. ఇప్పుడు కూడా అంతే. కఠిన పరిస్థితుల నుంచే మనం పాఠాలు నేర్చుకుంటాం’ అని లాంగర్ అభిప్రాయపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment