న్యూజిలాండ్‌ చేతిలో భారత్‌ వైట్‌వాష్‌ | New Zealand Won The ODI Series Against India | Sakshi
Sakshi News home page

23 ఏళ్ల తర్వాత... 0-3 

Published Wed, Feb 12 2020 12:35 AM | Last Updated on Wed, Feb 12 2020 4:29 AM

New Zealand Won The ODI Series Against India - Sakshi

ఎప్పుడో 1997లో భారత జట్టు శ్రీలంక చేతిలో 0–3తో వన్డే సిరీస్‌లో పరాభవం ఎదుర్కొంది. సొంతగడ్డ అయినా, విదేశాల్లో అయినా ఆ తర్వాత ఎప్పుడూ అలాంటి పరిస్థితి టీమిండియాకు ఎదురు కాలేదు. కానీ ఇప్పుడు న్యూజిలాండ్‌ చేతిలో మళ్లీ అంతటి అవమానకర ఓటమి ఎదురైంది. టి20 సిరీస్‌ను 5–0తో క్లీన్‌స్వీప్‌ చేసి అద్భుతం చూపించిన మన జట్టు అంతలోనే వన్డేల్లో తలవంచింది. సరైన రీతిలో ప్రతీకారం తీర్చుకుంటూ కివీస్‌ ఇప్పుడు 3–0తో తమ ప్రతాపం ప్రదర్శించింది. రాహుల్‌ సెంచరీ, అయ్యర్‌ అర్ధ సెంచరీ సాధించినా 300 పరుగులు చేయలేకపోయిన కోహ్లి సేన చివరి మ్యాచ్‌లో లక్ష్యాన్ని కాపాడుకోవడంలో 
విఫలమైంది. అటు బౌలింగ్‌లో, ఇటు బ్యాటింగ్‌లో సమష్టి ప్రదర్శన కనబర్చిన కివీస్‌ పరిమిత ఓవర్ల పోటీల్లో లెక్క సరి చేసింది. ఇక ఇరు జట్లు టెస్టుల్లో అమీతుమీ తేల్చుకోవడమే మిగిలింది.


ట్రోఫీతో న్యూజిలాండ్‌ జట్టు

మౌంట్‌ మాంగనీ: న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్‌ గెలుపు రుచి చూడలేకపోయింది. మంగళవారం ఇక్కడ జరిగిన చివరి మ్యాచ్‌లో కివీస్‌ 5 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌ను 3–0తో సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. రాహుల్‌ (113 బంతుల్లో 112; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ సాధించగా, అయ్యర్‌ (63 బంతుల్లో 62; 9 ఫోర్లు) రాణిం చాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 100 పరుగులు జోడించారు. బెన్నెట్‌కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం కివీస్‌ 47.1 ఓవర్లలో 5 వికెట్లకు 300 పరుగులు సాధించింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హెన్రీ నికోల్స్‌ (103 బంతుల్లో 80; 9 ఫోర్లు),  గప్టిల్‌ (46 బంతుల్లో 66; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), గ్రాండ్‌హోమ్‌ (28 బంతుల్లో 58 నాటౌట్‌; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) విజయంలో కీలక పాత్ర పోషించారు. టేలర్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఈ నెల 21 నుంచి వెల్లింగ్టన్‌లో తొలి టెస్టు జరుగుతుంది.

కోహ్లి విఫలం... 
గత మ్యాచ్‌లాగే పృథ్వీ షా (42 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఈసారి కూడా దూకుడుగా ఆడగా, మయాంక్‌ (1) మళ్లీ విఫలమయ్యాడు. కోహ్లి (9) కూడా ఎక్కువ సేపు నిలబడలేదు. ఆ తర్వాత బెన్నెట్‌ వేసిన ఓవర్లో రెండు సిక్సర్లు, ఫోర్‌తో షా 16 పరుగులు రాబట్టడం విశేషం. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 56 పరుగులకు చేరింది. అయితే రెండో పరుగు తీసే ప్రయత్నం లో రనౌటైన షా నిరాశగా వెనుదిరిగాడు.

కీలక భాగస్వామ్యాలు...

అద్భుత ఫామ్‌లో ఉన్న రాహుల్, అయ్యర్‌ కలిసి ఈ దశలో జట్టు ఇన్నింగ్స్‌ను నడిపించారు. వీరిద్దరు చక్కటి భాగస్వామ్యంతో చకచకా పరుగులు సాధించారు. జేమీసన్‌ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన అయ్యర్‌ 52 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే అయ్యర్‌ను అవుట్‌ చేసి నీషమ్‌ ఈ జోడీని విడదీశాడు. రాహుల్‌తో జత కలిసిన మనీశ్‌ పాండే (48 బంతుల్లో 42; 2 ఫోర్లు) కూడా మంచి సహకారం అందించాడు. 66 బంతుల్లో రాహుల్‌ హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

64 పరుగుల వద్ద రాహుల్‌ను రనౌట్‌ చేసేందుకు వచ్చిన అవకాశాన్ని జారవిడిచిన సాన్‌ట్నర్‌... కొద్ది సేపటికే మళ్లీ అలాంటి తప్పు చేశాడు. పాండే 35 పరుగుల వద్ద సింగిల్‌కు ప్రయత్నించగా, ఫీల్డర్‌ నుంచి బంతిని అందుకున్న సాన్‌ట్నర్‌ బంతి తన చేతుల్లోకి రాక ముందే బెయిల్స్‌ను పడేశాడు. దాంతో రనౌట్‌ అవకాశం చేజారింది. బెన్నెట్‌ వేసిన తర్వాతి ఓవర్లో డీప్‌ స్క్వేర్‌ లెగ్‌ వైపు స్వీప్‌ చేసి రెండు పరుగులు తీసిన రాహుల్‌ 104 బంతుల్లో శతకం చేరుకున్నాడు. అయితే ఐదో వికెట్‌కు 107 పరుగులు జోడించిన అనంతరం రాహుల్, పాండేలిద్దరూ వరుస బంతుల్లో వెనుదిరగడంతో భారత్‌ 300 పరుగులు దాటడంలో విఫలమైంది.

సూపర్‌ ఓపెనింగ్‌ ...
గత రెండు మ్యాచ్‌లలో విడి విడిగా రాణించిన ఓపెనర్లు గప్టిల్, నికోల్స్‌ ఈ సారి కలిసి చెలరేగారు. తొలి ఓవర్‌ నుంచే వీరు ధాటిని ప్రదర్శించారు. సైనీ ఓవర్లో ఫోర్, సిక్స్‌ బాదిన గప్టిల్‌ ఆ తర్వాత మరో సారి అదే బౌలర్‌ ఓవర్లో వరుసగా సిక్స్, ఫోర్‌ కొట్టాడు. ఆ తర్వాత శార్దుల్‌ ఓవర్లో వరుస సిక్స్, ఫోర్‌తో 29 బంతుల్లోనే గప్టిల్‌ అర్ధసెంచరీ పూర్తయింది. తొలి పది ఓవర్లలో న్యూజిలాండ్‌ 65 పరుగులు చేసింది. ఎట్టకేలకు ఈ భాగస్వామ్యం వంద పరుగులు దాటిన తర్వాత గప్టిల్‌ను చహల్‌ బౌల్డ్‌ చేశాడు. ఆ తర్వాత నికోల్స్‌ కొన్ని చూడచక్కటి షాట్లు ఆడాడు. 72 బంతుల్లో అతను హాఫ్‌ సెంచరీని చేరుకున్నాడు. అయితే తక్కువ వ్యవధిలో విలియమ్సన్‌ (22), టేలర్‌ (12), నికోల్స్, నీషమ్‌ (19) వికెట్లు తీసి భారత్‌ ఒక్కసారిగా మ్యాచ్‌పై పట్టు బిగిస్తున్నట్లు కనిపించింది.

గ్రాండ్‌హోమ్‌ జోరు... 
ఐదో వికెట్‌ పడిన తర్వాత విజయానికి 63 బంతుల్లో 77 పరుగులు చేయాల్సిన స్థితిలో కివీస్‌ నిలిచింది. అయితే గ్రాండ్‌ హోమ్‌ మెరుపు బ్యాటింగ్‌తో జట్టును గెలిపించాడు. భారత్‌తో పోరులో 3 టి20ల్లో వరుసగా 0, 3, 5 పరుగులు... గత రెండు వన్డేల్లో 1, 5 పరుగులు చేసిన అతను అసలు మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. టామ్‌ లాథమ్‌ (34 బంతుల్లో 32 నాటౌట్‌; 3 ఫోర్లు)నుంచి అతనికి చక్కటి సహకారం లభించింది. శార్దుల్‌ వేసిన 43వ ఓవర్లో రెండు ఫోర్లు, సిక్స్‌ బాదిన గ్రాండ్‌హోమ్‌...అతనే వేసిన 46వ ఓవర్లో 3 ఫోర్లు, సిక్సర్‌ బాది జట్టును విజయానికి చేరువగా తెచ్చాడు. ఈ ఓవర్లో మొత్తం 20 పరుగులు వచ్చాయి. ఆరో వికెట్‌కు గ్రాండ్‌హోమ్, లాథమ్‌ 46 బంతుల్లోనే అభేద్యంగా 80 పరుగులు జోడించడం విశేషం.

మూడు మ్యాచుల్లోనూ మా ప్రదర్శన, ఫీల్డింగ్‌  అంతర్జాతీయ క్రికెట్‌ స్థాయికి తగిన విధంగా లేవు. తొలి వన్డేలో మాత్రం మేం గెలిచే స్థితిలో నిలిచాం. మైదానంలో ప్రత్యర్థిని ఓడించేందుకు మా ఆట సరిపోలేదు. టి20లు అద్భుతంగా ఆడినా వన్డేల్లో కొందరు కొత్త కుర్రాళ్లొచ్చారు. వారికి ఇది మంచి అనుభవం. టి20 సిరీస్‌ ఓడిన తర్వాత న్యూజిలాండ్‌ చాలా బాగా ఆడింది. వారికే 3–0తో గెలిచే అర్హత ఉంది. – విరాట్‌ కోహ్లి, భారత కెప్టెన్‌

గత నాలుగైదేళ్లలో ఇది భారత జట్టుకు నాలుగో లేదా ఐదో సిరీస్‌ పరాజయం మాత్రమే. ప్రతీ మ్యాచ్‌లో గెలవడం సాధ్యం కాదు.  మా ఫీల్డింగ్‌ పేలవంగా ఉందనేది వాస్తవం. తర్వాతి సిరీస్‌లోగా మా తప్పులు సరిదిద్దుకుంటాం. జడేజా అన్ని రంగాల్లో మంచి ప్రదర్శన కనబరుస్తుండటం వల్లే నేను, కుల్దీప్‌ ఒకే మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం రావడం లేదు. ఇద్దరం చెరి సగం మ్యాచ్‌లలో ఆడాల్సి వస్తోంది. – చహల్, భారత బౌలర్‌

1 సిరీస్‌లో బుమ్రా ఒక్క వికెట్‌ కూడా తీయకపోవడం ఇదే మొదటిసారి. తన కెరీర్‌లో అతను ఇప్పటి వరకు 16 సిరీస్‌లు ఆడాడు. స్వదేశంలో ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో కూడా మూడు మ్యాచ్‌లలో కలిపి అతను ఒకటే వికెట్‌ పడగొట్టాడు.
4 మూడు లేదా అంతకంటే ఎక్కువ వన్డేలు ఉన్న ద్వైపాక్షిక సిరీస్‌లో భారత్‌ వైట్‌వాష్‌కు గురవడం ఇది నాలుగోసారి. 1983, 1989లలో విండీస్‌ 5–0తో భారత్‌పై  గెలవగా...1997లో శ్రీలంక 3–0తో ఓడించింది. కోహ్లి సారథ్యంలో ఏ ఫార్మాట్‌లోనైనా భారత్‌కు ఇలాంటి ఫలితం రావడం ఇదే   మొదటిసారి.

స్కోరు వివరాలు 
భారత్‌ ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (రనౌట్‌) 40; మయాంక్‌ (బి) జేమీసన్‌ 1; కోహ్లి (సి) జేమీసన్‌ (బి) బెన్నెట్‌ 9; అయ్యర్‌ (సి) గ్రాండ్‌హోమ్‌ (బి) నీషమ్‌ 62; రాహుల్‌ (సి) జేమీసన్‌ (బి) బెన్నెట్‌ 112; పాండే (సి) సాన్‌ట్నర్‌ (బి) బెన్నెట్‌ 42; జడేజా (నాటౌట్‌) 8; శార్దుల్‌ (సి) గ్రాండ్‌హోమ్‌ (బి) బెన్నెట్‌ 7; సైనీ (నాటౌట్‌) 8; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 296.
వికెట్ల పతనం: 1–8; 2–32; 3–62; 4–162; 5–269; 6–269; 7–280. బౌలింగ్‌: సౌతీ 9–0–59–0; జేమీసన్‌ 10–0–53–1; బెన్నెట్‌ 10–1–64–4; గ్రాండ్‌హోమ్‌ 3–0–10–0; నీషమ్‌ 8–0–50–1; సాన్‌ట్నర్‌ 10–0–59–0.  
న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: గప్టిల్‌ (బి) చహల్‌ 66; నికోల్స్‌ (సి) రాహుల్‌ (బి) శార్దుల్‌ 80; విలియమ్సన్‌ (సి) మయాంక్‌ (బి) చహల్‌ 22; రాస్‌ టేలర్‌ (సి) కోహ్లి (బి) జడేజా 12; లాథమ్‌ (నాటౌట్‌) 32; నీషమ్‌ (సి) కోహ్లి (బి) చహల్‌ 19; గ్రాండ్‌హోమ్‌ (నాటౌట్‌) 58; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (47.1 ఓవర్లలో 5 వికెట్లకు) 300.
వికెట్ల పతనం: 1–106; 2–159; 3–186; 4–189; 5–220. బౌలింగ్‌: బుమ్రా 10–0–50–0; సైనీ 8–0–68–0; చహల్‌ 10–1–47–3; శార్దుల్‌ 9.1–0–87–1; జడేజా 10–0–45–1.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement