
టీమిండియాకు భారీ లక్ష్యం
సిడ్నీ:టీమిండియాతో జరుగుతున్న ఆఖరి వన్డేలో ఆస్ట్రేలియా 331 పరుగుల భారీ లక్ష్యాన్నినిర్దేశించింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ల జోడి టీమిండియా బౌలింగ్ కు చుక్కలు చూపించడంతో ఆసీస్ మరోసారి మూడొందల పైచిలుకు పరుగులను నమోదు చేసింది. వార్నర్(122; 113 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు), మిచెల్ మార్ష్(102 నాటౌట్;84 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు )లు శతకాలతో దుమ్మురేపారు.
టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయాల్సిదింగా ఆసీస్ ను ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ ఆదిలోనే ఫించ్(6) వికెట్ ను కోల్పోయింది. అనంతరం కెప్టెన్ స్టీవ్ స్మిత్(28), జార్జ్ బెయిలీ(6)లు నిరాశపరచడంతో ఆసీస్ 78 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్టు కనిపించింది. ఆపై షాన్ మార్ష్(7) నాల్గో వికెట్ గా అవుటయ్యాడు. అయితే అప్పటికే క్రీజ్ లో కుదురుకున్న వార్నర్ ఏమాత్రం తడబాటు పడకుండా వన్డే కెరీర్ లో ఐదో సెంచరీ సాధించాడు. అతనికి జతగా మిచెల్ మార్ష్ కూడా రాణించడంతో ఆసీస్ స్కోరు బోర్డు పరుగులు తీసింది. ఈ జోడీ ప్రత్యేకంగా ఐదో వికెట్ కు 118 పరుగులు నమోదు చేసి ఆసీస్ ను పటిష్టస్థితికి చేర్చింది.
వార్నర్ అవుటైన తరువాత మిచెల్ మార్ష్ మరింత ప్రమాదకరంగా మారాడు. చివర వరకూ అజేయంగా క్రీజ్ లో ఉన్న మిచెల్ మార్ష్ వన్డేలో తొలి సెంచరీ నమోదు చేయడంతో ఆసీస్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో ఇషాంత్ శర్మ, బూమ్రాహ్ లకు తలో రెండు వికెట్లు లభించగా, రిషి ధవన్ , ఉమేష్ యాదవ్ లకు చెరో వికెట్ దక్కింది.
ఆకట్టుకున్న బూమ్రాహ్
ఆస్ట్రేలియాతో ఐదు వన్డేలో సిరీస్ లో భాగంగా చివరి మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన బూమ్రాహ్ ఆకట్టుకున్నాడు. 10 ఓవర్ల కోటాను పూర్తి చేసిన బూమ్రాహ్ రెండు వికెట్లు తీసి 40 పరుగులిచ్చాడు. టీమిండియా బౌలింగ్ ను ఆసీస్ ఊచకోత కోసిన చోట బూమ్రాహ్ పొదుపు బౌలింగ్ చేయడం విశేషం. తొలి స్పెల్ లో ఐదు ఓవర్లలో 17 పరుగులిచ్చి స్మిత్ వికెట్ ను తొలి వికెట్ గా తన ఖాతాలో వేసుకున్న బూమ్రాహ్.. తన చివరి ఓవర్ ల్ ఫాల్కనర్ బౌల్డ్ చేశాడు.
ఈ మ్యాచ్ లో ప్రధాన బౌలర్లు ఇషాంత్ శర్మ 10 ఓవర్లు బౌలింగ్ వేసి 60 పరుగులిచ్చి రెండు వికెట్లు తీయగా, ఉమేష్ యాదవ్ 8 ఓవర్లు వేసి 82 పరుగులిచ్చి ఒక వికెట్ తీయగా, రిషి ధవన్ 10 ఓవర్లలో 74 పరుగులిచ్చి ఒక వికెట్ సాధించాడు. మిగతా బౌలర్లలో జడేజా 10 ఓవర్లలో 46 పరుగులివ్వగా, గుర్ కీరత్ సింగ్ రెండు ఓవర్లలో 17పరుగులిచ్చాడు.