ఆస్ట్రేలియాకు అనూహ్య షాక్
గాయంతో సిరీస్ నుంచి తప్పుకున్న స్టార్క్
జట్టు అవకాశాలపై ప్రభావం
రాంచీ: భారత్ చేతిలో రెండో టెస్టులో ఓటమితో పాటు రివ్యూ వివాదంతో మానసికంగా కుంగిపోయిన ఆస్ట్రేలియాకు ఇప్పుడు మరో ఎదురుదెబ్బ తగిలింది. జట్టు ప్రధాన పేసర్, ప్రపంచ అగ్రశ్రేణి బౌలర్లలో ఒకడైన మిషెల్ స్టార్క్ గాయం కారణంగా సిరీస్‌లో మిగిలిన రెండు టెస్టులకు దూరమయ్యాడు. కుడి కాలులో ఫ్రాక్చర్ కారణంగా అతను తప్పుకుంటున్నట్లు ఆసీస్ జట్టు మేనేజ్‌మెంట్ ప్రకటించింది. బెంగళూరు టెస్టు సమయంలోనే గాయమైనా స్టార్క్ ఆటను కొనసాగించాడు. అయితే నొప్పి తీవ్రత ఎక్కువ కావడంతో శుక్రవారం స్కానింగ్ నిర్వహించడంతో ఫ్రాక్చర్ విషయం బయట పడింది. ‘స్టార్క్ కాలికి అయిన గాయం మేం ఆశించిన విధంగా కొద్ది రోజుల్లో తగ్గిపోలేదు. దాంతో ఇక తర్వాతి మ్యాచ్‌లు ఆడలేడని అర్థమైంది. చికిత్స కోసం అతను స్వదేశం తిరిగి వెళుతున్నాడు’ అని ఆసీస్ ఫిజియోథెరపిస్ట్ డేవిడ్ బీక్లే వెల్లడించారు. రెండు రోజుల క్రితమే ఆసీస్ ఆల్‌రౌండర్ మిషెల్ కూడా గాయంతో సిరీస్‌కు దూరమయ్యాడు.
భారత్‌లోని స్పిన్ పిచ్‌లపై కూడా తమ ప్రధానాస్త్రంగా స్టార్క్‌ను నమ్ముకొనే ఆస్ట్రేలియా భారత్‌లో అడుగు పెట్టింది. దానికి తగినట్లుగా అతను కూడా తన పేస్‌తో రెండు టెస్టులలో ప్రభావం చూపించాడు. పుణే టెస్టులో బ్యాటింగ్‌లో కూడా చెలరేగి స్టార్క్ అర్ధ సెంచరీ చేయడం కూడా జట్టు విజయానికి కారణమైంది. మరోవైపు స్టార్క్ స్థానంలో మరే ఆటగాడి పేరు కూడా ఆస్ట్రేలియా ప్రకటించలేదు. సిరీస్‌లో పాల్గొంటున్న ప్రస్తుత జట్టులో రిజర్వ్ పేసర్‌గా జాక్సన్ బర్డ్ ఉన్నాడు. అయితే దేశవాళీలో రాణిస్తున్న చాడ్ సాయెర్స్, జాసన్ బెహ్రన్‌డార్ఫ్, ప్యాట్ కమిన్స్ పేర్లను కూడా జట్టు పరిశీలిస్తోంది. స్టార్క్ లేకపోవడం ఆసీస్ విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అభిప్రాయపడ్డారు. ‘ఆసీస్ జట్టుకు స్టార్క్ ప్రధాన బలం. అతను లేనట్లయితే జట్టుపై చాలా ప్రభావం పడుతుంది. ఇకపై సిరీస్‌లో ఆసీస్ పరిస్థితి మరింత కఠినంగా మారబోతోంది’ అని క్లార్క్ అన్నారు.