
అడిలైడ్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ రెండో టెస్టులో అతిథ్య ఆస్ట్రేలియా జట్టు మెరుగైన స్థితిలో నిలిచింది. షాన్ మార్ష్ (126 నాటౌట్; 15 ఫోర్లు, ఒక సిక్స్) అద్భుత సెంచరీతో 442/8 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన ఆసీస్... అనంతరం ఇంగ్లండ్ ఓపెనర్ స్టోన్‌మన్ వికెట్ పడగొట్టి శుభారంభం చేసింది. 9.1 ఓవర్లో 29/1 స్కోరు వద్ద వర్షం ప్రారంభం కావడంతో రెండో రోజు ఆట నిలిచిపోయింది. ఆట ముగిసే సమయానికి కుక్ (11 బ్యాటింగ్), విన్స్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 209/4తో రెండో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్ మూడో బంతికే హ్యాండ్స్‌కోంబ్ (36) అవుటయ్యాడు. అనంతరం పైన్ (57; 6 ఫోర్లు, ఒక సిక్స్)తో కలిసి షాన్ మార్ష్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. అర్ధసెంచరీ తర్వాత పైన్ అవుటైనా లోయర్ ఆర్డర్ సాయంతో మార్ష్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివర్లో కమిన్స్ (44; 7 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. కమిన్స్ నిష్క్రమించిన కొద్దిసేపటికే కెప్టెన్ స్మిత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు.