బజ్జీకి కౌంటర్ ఇచ్చిన ఆసీస్ స్పిన్నర్
Published Tue, Feb 21 2017 8:43 PM | Last Updated on Tue, Sep 5 2017 4:16 AM
భారత్‌లో జరిగే టెస్టు సిరీస్‌లో భారత్‌కు గట్టి పోటి ఇస్తామని ఆస్ట్రేలియా ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియోన్ చెప్పాడు. భారత ప్రముఖ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఇటీవల ఆస్ట్రేలియా జట్టును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు లియోన్ మంగళవారం బదులిచ్చాడు. ప్రస్తుత ఆసీస్ జట్టు అత్యంత బలహీనమైన జట్టు అని, భారత్ సిరీస్‌ను 4-0తో వైట్ వాష్ చేస్తుందని బజ్జీ తెలిపిన విషయం తెలిసిందే. ఎవరి నమ్మకాలు వారివని, వారి మాటలు మా జట్టు పట్టించుకోదని లియోన్ అన్నాడు. కెప్టెన్ స్మిత్, వైస్ కెప్టెన్ వార్నర్, యువ క్రికెటర్లతో ఆస్ట్రేలియా జట్టు పటిష్టంగా ఉందని తెలిపాడు. భారత్‌కు గట్టి పోటి ఇచ్చి మంచి ఫలితాలు పొందుతామని ఆశాభావం వ్యక్తం చేశాడు. దీనికి మా జట్టు గట్టిగా సాధన చేస్తుందని, గెలుస్తామనే సంకల్పంతో ఉన్నామని పేర్కొన్నాడు. భారత్ నెం.1 స్థానంలో ఉండగా ఆసీస్ వెనుకే ఉందన్నాడు. మేము ఫాస్ట్ బౌలర్లతో తొలి రోజే 5 వికెట్లు పడగొడ్తమనుకోవడం లేదని, ఇది మాకు పెద్ద సవాలని చెప్పాడు.
ఇక భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్‌ను లియోన్ పొగడ్తలతో ముంచెత్తాడు. అశ్విన్ వరల్డ్ క్లాస్ స్పిన్నరని, అతని నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉందన్నాడు. ఇప్పటి వరకు ఏమి చేశానో చెప్పడం లేదని, గత నాలుగు ఏళ్లతో పోలిస్తే ఉపఖండ పరిస్థితులకు అనుగుణంగా చాలా మారనని లియోన్ తెలిపాడు. జట్టులో అందరూ యువ స్పిన్నర్లే కావడంతో జట్టు స్పిన్ దాడికి నాయకుడిగా ఉంటున్నానని, ఇది చాలా సంతోషమైన విషయమని, ఒత్తిడిగా భావించడం లేదని తెలిపాడు. మంచిగా బౌలింగ్ చేసి బ్యాటింగ్ జట్టును ఒత్తిడికి గురి చేయడమే తన కర్తవ్యమని లియోన్ అభిప్రాయపడ్డాడు.
Advertisement