
ఆసీస్ సూపర్ షో
దక్షిణాఫ్రికాతో చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా జరిగిన రెండో టి20లో ఆస్ట్రేలియా ఐదు వికెట్ల తేడాతో నెగ్గింది.
వార్నర్, మ్యాక్స్‌వెల్ మెరుపులు దక్షిణాఫ్రికాపై రెండో టి20లో విజయం
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాతో చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా జరిగిన రెండో టి20లో ఆస్ట్రేలియా ఐదు వికెట్ల తేడాతో నెగ్గింది. 205 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ చివరి బంతికి గెలిచింది. దీంతో మూడు టి20ల సిరీస్‌లో 1-1తో పోటీలో నిలిచింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ప్రొటీస్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 204 పరుగులు చేసింది. డు ప్లెసిస్ (41 బంతుల్లో 79; 5 ఫోర్లు; 5 సిక్సర్లు), డి కాక్ (28 బంతుల్లో 44; 8 ఫోర్లు; 1 సిక్స్), మిల్లర్ (18 బంతుల్లో 33; 2 ఫోర్లు; 2 సిక్సర్లు) వేగంగా ఆడి భారీ స్కోరుకు సహాయపడ్డారు. ఫాల్క్‌నర్‌కు మూడు, హేస్టింగ్స్‌కు రెండు వికెట్లు పడ్డాయి.
ఆ తర్వాత లక్ష్య చేధనకు బరిలోకి దిగిన ఆసీస్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 205 పరుగులు చేసి గెలిచింది. అయితే 32 పరుగులకే మూడు వికెట్లు కోల్పోగా డేవిడ్ వార్నర్ (40 బంతుల్లో 77; 6 ఫోర్లు; 5 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్ (43 బంతుల్లో 75; 7 ఫోర్లు; 3 సిక్సర్లు) తుఫాన్ ఇన్నింగ్స్‌తో ప్రొటీస్‌ను వణికించారు. వీరిద్దరి జోరుతో నాలుగో వికెట్‌కు రికార్డు స్థాయిలో 161 పరుగులు వచ్చాయి. దీంతో ఆసియా కప్ టి20లో ఇదే వికెట్‌కు ఉమర్ అక్మల్, షోయబ్ మధ్య నెలకొన్న ప్రపంచ రికార్డు కనుమరుగైంది. మ్యాక్స్ 19వ ఓవర్ తొలి బంతికి, వార్నర్ చివరి ఓవర్ తొలి బంతికి అవుటైనా ఆసీస్ ఇబ్బంది పడకుండా నెగ్గింది. రబడా, స్టెయిన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.