ఆసీస్‌దే టి20 సిరీస్
మెల్‌బోర్న్: ఫార్మాట్ ఏదైనా తమ ఆటతీరు మారలేదని ఇంగ్లండ్ జట్టు మరోసారి నిరూపించుకుంది. యాషెస్, వన్డే సిరీస్‌లాగే టి20 సిరీస్‌ను కూడా ఆస్ట్రేలియాకు అప్పగించింది. శుక్రవారం ఎంసీజీలో జరిగిన రెండో టి20లో ఇంగ్లండ్ ఎనిమిది వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దీంతో ఆసీస్ 2-0తో సిరీస్ గెలుచుకుంది. నామమాత్రపు చివరి టి20 సిడ్నీలో ఆదివారం జరుగుతుంది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 130 పరుగులు చేసింది. బట్లర్ (27 బంతుల్లో 22; 2 ఫోర్లు) ఒక్కడే టాప్ స్కోరర్. ఓవర్‌కో వికెట్ చొప్పున నాలుగో ఓవర్ నుంచి ఏడో ఓవర్ దాకా వరుసగా నాలుగు వికెట్లు కోల్పోవడంతో ఇంగ్లండ్ కోలుకోలేకపోయింది. హాజెల్‌వుడ్‌కు నాలుగు వికెట్లు దక్కాయి.
అనంతరం ఆసీస్ మరో 31 బంతులు మిగిలి ఉండగానే 14.5 ఓవర్లలో రెండు వికెట్లకు 131 పరుగులు చేసి నెగ్గింది. తొలి ఓవర్ నుంచే వైట్ (45 బంతుల్లో 58 నాటౌట్; 9 ఫోర్లు) బౌండరీల వరద పారించగా... కెప్టెన్ జార్జి బెయిలీ (28 బంతుల్లో 60 నాటౌట్; 7 ఫోర్లు; 3 సిక్స్‌లు) దూకుడైన ఆటతీరుతో పర్యాటక బౌలర్లను ఆడుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో నమోదైన 3 సిక్స్‌లు బెయిలీ బ్యాట్ నుంచే వచ్చాయి.