ఆసీస్ పుంజుకునేనా!
♦ నేటి నుంచి యాషెస్ నాలుగో టెస్టు
♦ సిరీస్ విజయంపై ఇంగ్లండ్ గురి
♦ మ. గం. 3.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం
నాటింగ్‌హామ్ : యాషెస్ సిరీస్‌లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు గురువారం నుంచి ట్రెంట్‌బ్రిడ్జ్‌లో జరగనుంది. ఇప్పటికే రెండు టెస్టులు గెలిచిన ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే గెలుస్తుంది. మరోవైపు ఒక మ్యాచ్‌లో గెలిచిన ఆస్ట్రేలియా సిరీస్ గెలవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా నెగ్గాలి. ఈ సిరీస్‌లో జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఫలితం ఏకపక్షంగా వచ్చింది. రెండు టెస్టుల్లో ఇంగ్లండ్ ఘన విజయం సాధిస్తే... మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ విజయం సాధించింది. స్వింగ్ బౌలర్లకు సహకరించే ట్రెంట్‌బ్రిడ్జ్ పిచ్‌పై అండర్సన్ సేవలు అందుబాటులో లేకపోవడం ఇంగ్లండ్‌కు దెబ్బ. అతని స్థానంలో మార్క్ వుడ్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
రిటైర్ కాను: క్లార్క్
వరుసగా మూడు టెస్టుల్లో ఘోరంగా విఫలమైన ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ కావాలనే డిమాండ్ వినిపిస్తోంది. అయితే తనలో క్రికెట్ ఆడాలన్న తపన తగ్గలేదని, ఇప్పట్లో రిటైరయ్యే ఆలోచన లేదని క్లార్క్ స్పష్టం చేశాడు.