
ఆస్ట్రేలియా భారీ స్కోరు
ఓవల్: యాషెస్ సిరీస్ ఐదో టెస్టులో రెండో రోజు కూడా ఆస్ట్రేలియా మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చింది. స్టీవెన్ స్మిత్ (241 బంతుల్లో 138 నాటౌట్; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు కూడా తలా ఒక చేయి వేయడంతో ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్ల నష్టానికి 492 పరుగుల భారీస్కోరు చేసి డిక్లేర్ చేసింది. అనంతరం జాగ్రత్తగా ఆడిన ఇంగ్లండ్ రెండో రోజు గురువారం ఆట ముగిసే సరికి 17.3 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 32 పరుగులు చేసింది. కుక్ (17), రూట్ (13) క్రీజ్‌లో ఉన్నారు. వర్షం కారణంగా ఒక సెషన్ పూర్తిగా రద్దు కావడంతో గురువారం 56.1 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.
అండర్సన్‌కు 4 వికెట్లు...
వర్షం కారణంగా కెన్నింగ్టన్ ఓవల్ మైదానమంతా తడిసి ముద్దయింది. దాంతో లంచ్ వరకు కూడా ఒక్క బంతి పడలేదు. లంచ్ విరామం తర్వాత ఆసీస్ 307/4 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించింది. యువ బ్యాట్స్‌మన్ స్టీవెన్ స్మిత్ రెండో రోజు కూడా తన జోరు కొనసాగించాడు. నైట్ వాచ్‌మన్ సిడిల్ (27 బంతుల్లో 23; 2 ఫోర్లు)ను ఆరంభంలోనే అండర్సన్ అవుట్ చేసినా...హాడిన్ (57 బంతుల్లో 30; 5 ఫోర్లు)తో కలిసి స్మిత్ ఆరో వికెట్‌కు 65 పరుగులు జోడించాడు.
ఈ క్రమంలో స్మిత్ 198 బంతుల్లో టెస్టుల్లో తన తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 94 పరుగుల స్కోరు వద్ద ట్రాట్ బౌలింగ్‌లో అద్భుతమైన సిక్సర్‌తో అతను ఈ మార్క్‌ను అందుకున్నాడు. జట్టుకు వేగంగా స్కోరు అందించే ప్రయత్నంలో ఫాల్క్‌నర్ (21 బంతుల్లో 23; 4 ఫోర్లు), స్టార్క్ (8 బంతుల్లో 13; 1 ఫోర్), హారిస్ (27 బంతుల్లో 33; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కూడా ధాటిగా ఆడారు.