
పోర్వోరిమ్: భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ కుమారుడు అసదుద్దీన్ (28) రంజీ ట్రోఫీలో గోవా జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. గురువారం సర్వీసెస్‌తో ప్రారంభమైన మ్యాచ్‌లో అతనికి చోటు దక్కింది. తొలి రోజు అసద్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. హైదరాబాద్‌లో స్థానిక లీగ్‌లు ఆడటం మినహా మరే అనుభవం లేని అసద్‌ను గోవా జట్టు ‘ప్రొఫెషనల్ ప్లేయర్’గా టీమ్‌లోకి తీసుకోవడంపై సీజన్ ఆరంభంనుంచి విమర్శలు కొనసాగుతున్నాయి. గతంలో యూపీ తరఫున ఆడే ప్రయత్నం చేసినా తుది జట్టులోకి ఎంపిక కాలేదు. ఐపీఎల్ ట్రయల్స్‌కు వెళ్లినా అసద్ ఎంపిక కాలేకపోయాడు. గోవా జట్టుకు గత ఆగస్టులో హైదరాబాద్‌లోనే శిక్షణా శిబిరం జరిగింది. దీనిని స్వయంగా పర్యవేక్షించడంతో పాటు ఎలాంటి ఫీజు లేకుండా జట్టుకు సలహాదారుడిగా కూడా అజహర్ వ్యవహరించాడు. ఇదే కారణంగా అసద్‌ను చోటిచ్చారని గోవా సీనియర్ క్రికెటర్లు తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు.