బ్రెజిల్‌ను నిలువరించిన ఈక్వెడార్
► 0-0తో మ్యాచ్ డ్రా
► కోపా అమెరికా కప్ టోర్నమెంట్
లాస్ ఏంజిల్స్: ప్రపంచ మాజీ చాంపియన్ బ్రెజిల్‌ను ఈక్వెడార్ జట్టు సమర్థవంతంగా నిలువరించింది. దీనికి తోడు వివాదాస్పద రిఫరీ నిర్ణయం బ్రెజిల్‌కు అనుకూలంగా మారడంతో ఓటమి నుంచి గట్టెక్కింది. ఫలితంగా కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం గ్రూప్ ‘బి’లో జరిగిన ఈ మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది. ప్రథమార్ధంలో ఎక్కువ సమయం బంతిని తమ ఆధీనంలో ఉంచుకున్నా బ్రెజిల్ గోల్ చేయడంలో విఫలమైంది. అయితే ద్వితీయార్ధం ఈక్వెడార్ ఆటగాళ్ల నుంచి ఎదురుదాడి ఎక్కువ కావడంతో బ్రెజిల్ ఇబ్బంది పడింది. 66వ నిమిషంలో ఈక్వెడార్ ఆటగాడు మిలర్ బోలనోస్ సంధించిన క్రాస్ షాట్‌ను అడ్డుకోవడంలో బ్రెజిల్ గోల్ కీపర్ విఫలం కావడంతో బంతి నెట్‌లోనికి వెళ్లింది.
అయితే సంబరాల్లో మునిగిన ఈక్వెడార్ రిఫరీ నిర్ణయంతో షాక్ తిన్నది. క్రాస్ షాట్ ఆడడానికి ముందే బంతి ఎండ్ లైన్ దాటిందని ప్రకటించడం ఆ జట్టును అసహనానికి గురి చేసింది. 83వ నిమిషంలో లుకాస్ (బ్రెజిల్) హెడర్ వైడ్‌గా వెళ్లడంతో గోల్ మిస్ అయ్యింది. అయితే ఆట ముగిశాక బ్రెజిల్ ఆటగాళ్లను 53 వేలకు పైగా ఉన్న ప్రేక్షకులు గేలి చేశారు.
పెరూ విజయం
సీటల్: మరో గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో మాజీ చాంపియన్ పెరూ 1-0 తేడాతో హైతీని ఓడించింది. ద్వితీయార్ధం 61వ నిమిషంలో స్ట్రయికర్ గెరెరో తమ జట్టుకు ఏకైక గోల్‌ను అందించాడు. హైతీ డిఫెన్స్ సమర ్థవంతంగా అడ్డుకోవడంతో పెరూకు మరిన్ని గోల్స్ వచ్చే అవకాశం లేకుండా పోయింది.
కోస్టారికా, పరాగ్వే మ్యాచ్ డ్రా
ఓర్లాండో: గ్రూప్ ‘ఎ’లో భాగంగా పరాగ్వే, ఈక్వెడార్ మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది. ఇంజ్యురీ సమయంలో డిఫెండర్ కెండాల్ వాస్టన్ రెడ్ కార్డుకు గురవ్వడంతో కోస్టారికా 10 మందితోనే ఆడాల్సి వచ్చింది. 33 డిగ్రీల అధిక వేడిలో మ్యాచ్ జరగడం కూడా ఇరు జట్ల ఆటగాళ్లను ఇబ్బంది పెట్టింది.