బెంగాల్ జట్టులోని 22 మందికీ పోలీస్ ఉద్యోగాలిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
రూ. 50 లక్షల నజరానా అందజేత
సంతోష్ ట్రోఫీ జాతీయ సీనియర్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ టైటిల్ సాధించిన బెంగాల్ జట్టు ఆటగాళ్లకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈ టోర్నీలో బెంగాల్ జట్టు రికార్డు స్థాయిలో 33వసారి ట్రోఫీ నెగ్గిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో... విజేత జట్టులోని ఆటగాళ్లందరికీ పోలీస్ విభాగంలో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్‌ఐ)లుగా నియమించనున్నట్లుప్రభుత్వం ప్రకటించింది.
సంతోష్ ట్రోఫీ విజేతలకు బుధవారం నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో బెంగాల్ క్రీడా శాఖ మంత్రి అరూప్ బిశ్వాస్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. జట్టులోని మొత్తం 22 మంది ప్లేయర్లకు ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు, ఈ నియామకాలకు సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తయిందని మంత్రి తెలిపారు.
అదే విధంగా.. జట్టులోని సభ్యులకు బెంగాల్ ప్రభుత్వం రూ. 50 లక్షల నజరానా ప్రకటించింది. ఇటీవల హైదరాబాద్ వేదికగా జరిగిన సంతోష్ ట్రోఫీ ఫైనల్లో కేరళను ఓడించి బెంగాల్ జట్టు చాంపియన్‌గా నిలిచి సత్తా చాటింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేర నజరానాతో పాటు ఉద్యోగం రూపంలో మంచి బహుమతి ఇచ్చింది.
మరిన్ని క్రీడా వార్తలు
క్వార్టర్స్‌లో యూకీ ద్వయం
ఆక్లాండ్: కొత్త ఏడాదిని భారత డబుల్స్ టెన్నిస్ స్టార్ యూకీ బాంబ్రీ విజయంతో ప్రారంభించాడు. ఏఎస్‌బీ క్లాసిక్ ఆక్లాండ్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ శుభారంభం చేసింది.
బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో యూకీ–ఒలివెట్టి ద్వయం 6–4, 6–4తో సాండెర్ అరెండ్స్ (నెదర్లాండ్స్)–జాన్సన్ (బ్రిటన్) జంటను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ జంట రెండు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది.
హైదరాబాద్ తూఫాన్స్ గెలుపు
రూర్కెలా: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో హైదరాబాద్ తూఫాన్స్ జట్టు తొలి విజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన పోరులో హైదరాబాద్ 3–0 గోల్స్ తేడాతో యూపీ రుద్రాస్‌ను చిత్తు చేసింది. తొలి క్వార్టర్‌లో 2 గోల్స్ చేసిన హైదరాబాద్ మూడో క్వార్టర్‌లో మరో గోల్‌తో తమ ఆధిక్యాన్ని పెంచుకుంది. మూడు ఫీల్డ్ గోల్స్ సాధించిన తూఫాన్స్ మరో మూడు పెనాల్టీ కార్నర్‌లను వాడుకోలేకపోయింది.
మరో వైపు చివరి క్వార్టర్‌లో ఎనిమిది నిమిషాల వ్యవధిలో ఐదు పెనాల్టీలు సహా మొత్తం ఆరు పెనాల్టీలు వచ్చినా రుద్రాస్ వాటిలో ఒక్కదానిని కూడా గోల్‌గా మలచలేకపోయింది. హైదరాబాద్ తరఫున జాకరీ వాలెస్ (6వ నిమిషం), రాజీందర్ సింగ్ (14వ నిమిషం), శిలానంద్ లాక్డా (32వ నిమిషం) గోల్స్ నమోదు చేశారు.
ఎనిమిది జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో తాజా ఫలితం తర్వాత పాయింట్ల పట్టికలో హైదరాబాద్ ఐదో స్థానంలో కొనసాగుతోంది. గోల్స్ వర్షం కురిసిన మరో మ్యాచ్‌లో తమిళనాడు డ్రాగన్స్ 6–5 గోల్స్‌తో టీమ్ గోనాసిక వైజాగ్‌పై గెలుపొందింది. ఈ గెలుపుతో డ్రాగన్స్ రెండో స్థానానికి చేరగా, గోనాసిక ఏడో స్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment