సమర్పయామి... | Bangladesh beat India to win ODI series | Sakshi
Sakshi News home page

సమర్పయామి...

Published Mon, Jun 22 2015 1:38 AM | Last Updated on Sun, Sep 3 2017 4:08 AM

సమర్పయామి...

సమర్పయామి...

రెండో వన్డేలోనూ భారత్ చిత్తు
6 వికెట్లతో బంగ్లాదేశ్ ఘన విజయం
2-0తో సిరీస్ సొంతం
చాంపియన్స్ ట్రోఫీకి అర్హత
6 వికెట్లతో చెలరేగిన ముస్తఫిజుర్


పరాభవం, పరువు పోయింది అనడం కంటే మించిన విశేషణాలు ఇప్పుడు వెతుక్కోవాలేమో! గతంలో ఎన్ని పరాజయాలు ఎదుర్కొన్నా, ఎంతటి ఓటములు ఎదురైనా ఇలాంటి రోజు కూడా వస్తుందని సగటు భారత క్రీడాభిమాని ఎప్పుడూ ఆశించి ఉండడు. ఒక మ్యాచ్ ఓడితే... ఏంటో అలా జరిగిపోయింది అనుకున్నామే తప్ప ఇప్పుడు వరుసగా రెండోసారి ఓడితే జవాబిచ్చేందుకు మాటలు రాని స్థితి. ఇరవై ఏళ్ల కుర్రాడు తన బౌలింగ్‌తో ముప్పుతిప్పులు పెట్టిన చోట మూడు మార్పులు కూడా కలిసి రాకపోవడంతో భారత బలగం సమష్టిగా తలవంచింది. గతంలో మ్యాచ్ గెలిచేందుకే ఇబ్బంది పడిన ప్రత్యర్థికి ఏకంగా సిరీసే అప్పగించేసింది. అటు అన్ని రంగాల్లో చెలరేగి బంగ్లాదేశ్ తాము ఎంతో ఎదిగామని మరోసారి చాటింది. ఇది వారి దృష్టిలో సంచలనం కాదు. తాము నమ్మిన కుర్రాళ్లతో కలిసి సాధించిన విజయం. భవిష్యత్తులో తమను ఎవరూ తక్కువగా అంచనా వేయరాదన్న సంకేతం.

మిర్పూర్: భారత్‌కు మళ్లీ భంగపాటు... పసికూనగా భావించే ప్రత్యర్థి ఎప్పటికీ మరచిపోలేని దెబ్బ కొట్టింది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ధోని సేనను చిత్తుగా ఓడించి తమ సత్తా చాటింది. ఆదివారం ఇక్కడ జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకోగా... ఇన్నింగ్స్ చివర్లో వర్షం రావడంతో మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు. టీమిండియా 45 ఓవర్లలో 200 పరుగులకే ఆలౌటైంది.

 శిఖర్ ధావన్ (60 బంతుల్లో 53; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా, ధోని (75 బంతుల్లో 47; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. బంగ్లాదేశ్ లెఫ్టార్మ్ పేసర్ ముస్తఫిజుర్ రహమాన్ (6/43) మరోసారి చెలరేగిపోయాడు. అనంతరం డక్‌వర్త్ లూయీస్ ప్రకారం బంగ్లా లక్ష్యాన్ని 47 ఓవర్లలో 200 పరుగులుగా నిర్ణయించారు. ఆ జట్టు 38 ఓవర్లలో 4 వికెట్లకు 200 పరుగులు చేసి చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. షకీబుల్ హసన్ (62 బంతుల్లో 51 నాటౌట్; 5 ఫోర్లు) ముందుండి నడిపించగా... లిటన్ దాస్ (41 బంతుల్లో 36; 5 ఫోర్లు), సౌమ్య సర్కార్ (47 బంతుల్లో 34; 2 ఫోర్లు, 1 సిక్స్), ముష్ఫికర్ (31; 3 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచారు.

మళ్లీ ముస్తఫిజుర్ దెబ్బ: గత మ్యాచ్‌లో ఓడిన జట్టులో ఏకంగా మూడు మార్పులతో భారత్ బరిలోకి దిగింది. ఉమేశ్, మోహిత్, రహానే స్థానంలో ధావల్, అక్షర్, రాయుడు జట్టులోకి వచ్చారు. బంగ్లా కొత్త సంచలనం ముస్తఫిజుర్ ఇన్నింగ్స్ రెండో బంతికే రోహిత్ (0)ను అవుట్ చేసి భారత్‌కు షాక్ ఇచ్చాడు. మరోవైపు ధావన్ జాగ్రత్తగా ఆడగా... క్రీజ్‌లో కుదురుకున్న అనంతరం కోహ్లి (27 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్)... ముస్తఫిజర్ ఓవర్లో సిక్స్, ఫోర్ కొట్టి ఆధిక్యం ప్రదర్శించే ప్రయత్నం చేశాడు. అయితే ఇది ఎక్కువసేపు సాగలేదు. చక్కటి బంతితో కోహ్లిని వెనక్కి పంపిన పార్ట్ టైమర్ హొస్సేన్, కొద్ది సేపటికే ధావన్‌ను కూడా అవుట్ చేశాడు. తనకు దక్కిన అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయిన అంబటి రాయుడు (0) మరుసటి ఓవర్లోనే పెవిలియన్ చేరాడు.

ఈ దశలో ధోని, రైనా (55 బంతుల్లో 34; 3 ఫోర్లు) కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు. దాదాపు మూడేళ్ల తర్వాత ధోని నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగడం విశేషం. ఈ క్రమంలో వీరిద్దరు తమ సహజశైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడారు. ఒక దశలో 46 బంతుల పాటు ఒక్క బౌండరీ కూడా రాలేదు. తీవ్రంగా ఇబ్బంది పడ్డ రైనా చివరకు కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో 53 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత ముస్తఫిజుర్ మళ్లీ చెలరేగాడు. వరుస బంతుల్లో ధోని, అక్షర్ (0)లను అవుట్ చేసిన అతను తర్వాతి ఓవర్లో అశ్విన్ (4) పని పట్టాడు. రెండో పవర్‌ప్లేలో భారత్ 17 పరుగులు మాత్రమే చేసి 3 వికెట్లు కోల్పోయింది. వర్షం ఆగిన తర్వాత తొలి బంతికే జడేజా (19)ను పెవిలియన్ పంపించి ముస్తఫిజుర్ ఆరో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఎంతో శ్రమించి 200 పరుగులకు చేరిన భారత ఇన్నింగ్స్ నిర్ణీత ఓవర్ల కంటే 2 ఓవర్ల ముందే ముగిసింది. తలా ఓ చేయి: లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్‌కు చెప్పుకోదగ్గ ఆరంభం లభించలేదు. ధాటిగా ఆడే ప్రయత్నంలో ఓపెనర్ తమీమ్ (13) త్వరగానే వెనుదిరిగాడు.

అంతకుముందు రెండో ఓవర్లో తమీమ్ క్యాచ్‌ను కోహ్లి అందుకున్నా... రీప్లేలో అది నేలను తాకిందని తేలింది.  నాలుగో ఓవర్లోనే అశ్విన్‌ను దింపి ధోని ఫలితం రాబట్టే ప్రయత్నం చేసినా అది పెద్దగా ప్రయోజనాన్ని ఇవ్వలేదు. ఈ దశలో సర్కార్, దాస్ కలిసి జాగ్రత్తగా ఆడుతూ కీలక పరుగులు రాబట్టారు. అక్షర్ వేసిన తొలి ఓవర్లో 15 పరుగులు రావడంతో ఇన్నింగ్స్ వేగం పెరిగింది. అనంతరం 12 పరుగుల వ్యవధిలో వీరిద్దరు వెనుదిరగడంతో బంగ్లా ఒత్తిడిలో పడింది. కానీ ముష్ఫికర్, షకీబ్ కలిసి మరో కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. 9 పరుగుల వద్ద ముష్ఫికర్ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో రైనా వదిలేశాడు. అక్షర్ వేసిన మరో ఓవర్లో వీరిద్దరు 16 పరుగులు రాబట్టారు. అయితే రెండో పరుగు కోసం ప్రయత్నించి ముష్ఫికర్ రనౌట్ కావడంతో 54 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. అయితే అనుభవజ్ఞుడైన షకీబ్ మరింత బాధ్యతగా ఆడాడు. భారత బౌలింగ్‌లో వాడి లేకపోవడంతో షబ్బీర్ (23 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు)తో కలిసి ఏ మాత్రం తడబాటు లేకుండా అతను బంగ్లాను విజయతీరాలకు చేర్చాడు.

స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) షబ్బీర్ (బి) ముస్తఫిజుర్ 0; ధావన్ (సి) దాస్ (బి) హొస్సేన్ 53; కోహ్లి (ఎల్బీ) (బి) హొస్సేన్ 23; ధోని (సి) సర్కార్ (బి) ముస్తఫిజుర్ 47; రాయుడు (సి) హొస్సేన్ (బి) రూబెల్ 0; రైనా (సి) దాస్ (బి) ముస్తఫిజుర్ 34; జడేజా (బి) ముస్తఫిజుర్ 19; అక్షర్ (ఎల్బీ) (బి) ముస్తఫిజుర్ 0; అశ్విన్ (సి) దాస్ (బి) ముస్తఫిజుర్ 4; భువనేశ్వర్ (సి) దాస్ (బి) రూబెల్ 3; ధావల్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (45 ఓవర్లలో ఆలౌట్) 200
వికెట్ల పతనం: 1-0; 2-74; 3-109; 4-110; 5-163; 6-174; 7-174; 8-184; 9-196; 10-200.

బౌలింగ్: ముస్తఫిజుర్ 10-0-43-6; తస్కీన్ 4-0-24-0; మొర్తజా 7-0-35-0; హొస్సేన్ 10-0-33-2; రూబెల్ 7-0-26-2; షకీబ్ 7-0-33-0.

బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తమీమ్ (సి) ధావన్ (బి) ధావల్ 13; సర్కార్ (ఎల్బీ) (బి) అశ్విన్ 34; దాస్ (సి) ధోని (బి) అక్షర్ 36; ముష్ఫికర్ (రనౌట్) 31; షకీబ్ (నాటౌట్) 51; షబ్బీర్ (నాటౌట్) 22; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (38 ఓవర్లలో 4 వికెట్లకు) 200
వికెట్ల పతనం: 1-34; 2-86; 3-98; 4-152.

బౌలింగ్: భువనేశ్వర్ 5-0-32-0; ధావల్ 7-0-42-1; అశ్విన్ 10-2-32-1; జడేజా 7-0-28-0; అక్షర్ 7-0-48-1; రైనా 2-0-14-0.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement