చాంపియన్స్‌ ట్రోఫీ అంబాసిడర్‌గా శిఖర్‌ ధావన్‌ | Shikhar Dhawan Appointed As Ambassador For ICC Champions Trophy | Sakshi
Sakshi News home page

చాంపియన్స్‌ ట్రోఫీ అంబాసిడర్‌గా శిఖర్‌ ధావన్‌

Published Thu, Feb 13 2025 10:04 AM | Last Updated on Thu, Feb 13 2025 10:29 AM

Shikhar Dhawan Appointed As Ambassador For ICC Champions Trophy

దుబాయ్‌: భారత మాజీ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (Shikhar Dhawan)... చాంపియన్స్‌ ట్రోఫీ (Champions Trophy) అంబాసిడర్‌గా (Ambassador) నియమితుడయ్యాడు. ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ కోసం అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) నలుగురు అంబాసిడర్‌లను ఎంపిక చేసింది. ఇందులో ధావన్‌తో పాటు పాకిస్తాన్‌ జట్టుకు చాంపియన్స్‌ ట్రోఫీ అందించిన కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్, ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్‌ షేన్‌ వాట్సన్, న్యూజిలాండ్‌ దిగ్గజ పేసర్‌ టిమ్‌ సౌతీ చోటు దక్కించుకున్నారు.

2013లో భారత జట్టు చాంపియన్స్‌ ట్రోఫీ చేజిక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించిన శిఖర్‌... ఈ టోర్నీ చరిత్రలో వరుసగా రెండుసార్లు ‘గోల్డెన్‌ బ్యాట్‌’ అవార్డు గెలుచుకున్న ఏకైక ప్లేయర్‌గా నిలిచాడు. ‘చాంపియన్స్‌ ట్రోఫీ అంబాసిడర్‌గా ఎంపికవడం గౌరవంగా భావిస్తున్నా. ఏదో తెలియని కొత్త అనుభూతి కలుగుతోంది. ప్రపంచంలోని 8 అత్యుత్తమ జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా’ అని ధావన్‌ పేర్కొన్నాడు.

చాంపియన్స్‌ ట్రోఫీలో 701 పరుగులు చేసిన శిఖర్‌... భారత్‌ తరఫున ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. 2013 చాంపియన్స్‌ ట్రోఫీలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా నిలిచిన ధావన్‌... ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గానూ కొనసాగుతున్నాడు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement