
డబ్ల్యూపీఎల్‌లో 2023 టైటిల్ నెగ్గిన ముంబై ఇండియన్స్ గత ఏడాది డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగింది. అయితే అనూహ్యంగా ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో 5 పరుగుల తేడాతో ఓడి నిష్క్రమించింది. హర్మన్‌ప్రీత్ క్రీజ్‌లో ఉన్నంత వరకు జట్టు గెలుపు దిశగానే వెళ్లినా...ఆమె వెనుదిరిగాక ఇతర బ్యాటర్లు 12 బంతుల్లో 16 పరుగులు కూడా చేయలేకపోయారు. ఇది హర్మన్‌ను తీవ్రంగా బాధించింది. 2025 సీజన్‌కు ముందు జట్టు కోచ్ దేవిక పల్‌షికర్‌తో కలిసి హర్మన్ ఇదే విషయంపై ప్రత్యేకంగా చర్చించింది.
చివర్లో ధాటిగా ఆడే ప్రయత్నంలో ఒత్తిడి పెంచుకోవడంకంటే తొలి బంతినుంచే హర్మన్ తనదైన శైలిలో ధాటిగా ఆడాలనేది ప్రణాళిక. ఇందులో తొందరగా అవుటయ్యే ప్రమాదం ఉన్నా... ఇది సరైందిగా వారు భావించారు. ఈసారి టీమ్ విజయంలో బ్యాటర్‌గా హర్మన్ కీలక పాత్ర పోషించింది. ఏకంగా 154.87 స్ట్రైక్‌రేట్‌తో 302 పరుగులు సాధించి తన విలువను చాటింది. టోర్నీలో 11 సిక్స్‌లు బాదిన తీరు ఆమె ఆధిక్యాన్ని చూపించింది. ఈ టోర్నీలో ప్రతీ మ్యాచ్‌లో ఆమె దాదాపు చివరి వరకు నిలిచి పని పూర్తయ్యేలా చూసింది.
10 ఇన్నింగ్స్‌లలో 5 అర్ధసెంచరీలతో 523 పరుగులు చేసిన నాట్ సివర్ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. పరుగుల పట్టికలో మూడో స్థానంలో ఉన్న హేలీ మాథ్యూస్ (307) జట్టుకు అదనపు బలంగా మారింది. బౌలింగ్‌లో అమేలియా కెర్ (18 వికెట్లు), హేలీ మాథ్యూస్ (18), నాట్ సివర్ (12) ప్రత్యర్థులను పడగొట్టడంలో సఫలమయ్యారు. మరో ప్రధాన పేసర్ షబ్నిమ్ ఇస్మాయిల్ అంచనాలకు తగినట్లుగా రాణించకపోయినా... ఆ ప్రభావం జట్టుపై పడకుండా ఈ ముగ్గురు బాధ్యత తీసుకున్నారు. ఫైనల్లో మాత్రం షబ్నమ్ తన స్థాయి ప్రదర్శనను చూపించింది.
తొలి మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో పరాజయంతో ముంబై టోర్నీ మొదలైంది. అయితే ఆ తర్వాత వరుసగా మూడు విజయాలతో జట్టు కోలుకుంది. తర్వాతి మ్యాచ్‌లో మళ్లీ ఢిల్లీ చేతిలోనే పరాజయం. ఈ సారి హర్మన్, సివర్ ఇద్దరూ విఫలమయ్యారు. ఆ తర్వాత మరో రెండు మ్యాచ్‌లు గెలిచి ప్లే ఆఫ్స్ ఖాయమైనా... టాప్ స్థానం కోసం జట్టు గట్టిగానే పోరాడింది. అయితే బెంగళూరు చేతిలో ఓటమి తప్పలేదు. దాంతో ఎలిమినేటర్ మ్యాచ్‌లో ప్రదర్శనపై సందేహాలు వచ్చాయి.
అయితే సంపూర్ణ ఆధిక్యంతో విజయం సాధించిన ముంబై అలవోకగా ఫైనల్ చేరింది. గత రెండు లీగ్ మ్యాచ్ తరహాలో ఈ సారి కూడా ఢిల్లీపై ఆరంభంలో తడబాటు కనిపించింది. కానీ మళ్లీ హర్మన్, సివర్ భాగస్వామ్యమే జట్టును నడిపించింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ వీరిద్దరు పట్టుదలగా ఆడటంతో జట్టు ప్రత్యర్థికి సవాల్ విసిరేంత స్కోరును సాధించగలిగింది. ఫైనల్ సహా ఇదే వేదికపై వరుసగా నాలుగో మ్యాచ్ ఆడటం కూడా జట్టుకు కలిసొచ్చింది. టోర్నీలో ఢిల్లీ ఫామ్ చూస్తే 150 పరుగుల ఛేదన పెద్ద కష్టం కాదనిపించినా... ముంబై బౌలర్లంతా సమష్టిగా చెలరేగి మూడేళ్ల వ్యవధిలో రెండో టైటిల్‌ను అందించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment