ఏం వానో...తరుముతున్నది!
►నాలుగో రోజూ వర్షం అంతరాయం
► తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 462/6 డిక్లేర్డ్
► బంగ్లాదేశ్ 111/3
ఎలాగైనా ఫలితం రావాలి... భారత కెప్టెన్ కోహ్లి పట్టుదల ఇది. అందుకే బంగ్లాదేశ్‌తో టెస్టులో ఏమాత్రం సంకోచం లేకుండా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. చివరి రెండు రోజుల్లో బంగ్లాను ఆలౌట్ చేయాలనే కసితో కొత్త బంతినే స్పిన్నర్‌కు ఇచ్చాడు. భారత బౌలర్లు కూడా కెప్టెన్ ఆలోచనకు తగ్గట్లు స్పందించి ఒక్క సెషన్‌లోనే మూడు వికెట్లు తీశారు. కానీ ఏం లాభం... మళ్లీ వాన ముసురుకుంది. నాలుగో రోజు రెండు సెషన్ల ఆటను తుడిచిపెట్టింది. ఇక మిగిలింది ఒక్కరోజే కాబట్టి టెస్టు డ్రాగా ముగియడం లాంఛనమే.
ఫతుల్లా: భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య జరుగుతున్న ఏకైక టెస్టును వర్షం వీడటం లేదు. గత మూడు రోజులుగా అంతరాయం కలిగించిన వరుణుడు నాలుగో రోజు కూడా అడ్డుకున్నాడు. శనివారం ఒకే ఒక్క సెషన్ ఆట మాత్రమే సాధ్యం కావడంతో ఇక ఈ మ్యాచ్ డ్రా దిశగా సాగుతోంది. బ్యాటింగ్‌లో బంగ్లా బేబీలపై పరాక్రమం చూపెట్టిన టీమిండియా.. బౌలింగ్‌లోనూ దూకుడును కనబర్చింది. దీంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 30.1 ఓవర్లలో 3 వికెట్లకు 111 పరుగులు చేసింది. కైస్ (98 బంతుల్లో 59 బ్యాటింగ్; 10 ఫోర్లు), షకీబ్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. బంగ్లా ఇంకా 351 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌ను ఓవర్‌నైట్ స్కోరు 462/6 వద్ద డిక్లేర్ చేసింది. ఓవరాల్‌గా నాలుగు రోజులు కలిపి 200ల ఓవర్ల ఆట నష్టం జరిగింది.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: 462/6 డిక్లేర్డ్
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: తమీమ్ (స్టంప్డ్) సాహా (బి) అశ్విన్ 19; కైస్ బ్యాటింగ్ 59; మొమినల్ (సి) ఉమేశ్ (బి) హర్భజన్ 30; ముష్ఫికర్ (సి) రోహిత్ (బి) అశ్విన్ 2; షకీబ్ బ్యాటింగ్ 0; ఎక్స్‌ట్రాలు: 1; మొత్తం: (30.1 ఓవర్లలో 3 వికెట్లకు) 111.
వికెట్ల పతనం: 1-27; 2-108; 3-110.
బౌలింగ్: ఇషాంత్ 4-0-13-0; అశ్విన్ 11.1-2-30-2; ఉమేశ్ 4-0-34-0; ఆరోన్ 4-0-11-0; హర్భజన్ 7-0-23-1.
సెషన్-1: స్పిన్నర్ల హవా
వికెట్‌పై బంతి టర్న్ అవుతుండటంతో ఆరంభం నుంచే కోహ్లి... పేస్-స్పిన్ కాంబినేషన్‌ను బరిలోకి దించాడు. దీంతో పరుగులు చేయడానికి ఇబ్బంది పడిన ఓపెనర్ తమీమ్ (19) తొందరగా అవుటయ్యాడు. అయితే ఇమ్రూల్ కైస్, మొమినల్ (54 బంతుల్లో 30; 4 ఫోర్లు)లు నెమ్మదిగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను కుదుటపర్చారు. 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కైస్ క్యాచ్‌ను ధావన్ వదిలేశాడు. 13వ ఓవర్‌లో కాసేపు వర్షం అంతరాయం కలిగించింది. మ్యాచ్ మొదలయ్యాక నిలకడగా ఆడుతున్న కైస్, మొమినల్ జోడిని హర్భజన్ విడగొట్టాడు. భారీ షాట్‌కు ప్రయత్నించిన మొమినల్ మిడాఫ్‌లో ఉమేశ్ చేతికి చిక్కాడు. దీంతో రెండో వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక రెండు వైపుల నుంచి స్పిన్నర్లు రావడంతో బంగ్లా బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెరిగింది. అశ్విన్... ముష్ఫికర్ (2)ను అవుట్ చేయడంతో బంగ్లా 110 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. కొద్దిసేపటికే మరోసారి వర్షం రావడంతో ఆటను ఆపేశారు.
ఓవర్లు: 30.1; వికెట్లు: 3; పరుగులు: 111
సెషన్-2, 3: వర్షంతో రద్దు
లంచ్ తర్వాత కూడా వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో చివరి రెండు సెషన్ల ఆట సాధ్యం కాలేదు. మైదానం మొత్తం చిత్తడిగా మారిపోయింది. చివరకు స్థానిక కాలమానం ప్రకారం నాలుగు గంటలకు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు ఆటను రద్దు చేశారు.