2,2,3,1,10,6,5,0,3,6,4..ఇవేమి మ్యాజికల్ నంబర్స్ కాదు. దేశవాళీ లీగ్ సందర్భంగా ఒక జట్టులోని ఆటగాళ్లు వరుసగా నమోదు చేసిన పరుగులు.
ఢిల్లీ: 2,2,3,1,10,6,5,0,3,6,4..ఇవేమి మ్యాజికల్ నంబర్స్ కాదు. దేశవాళీ లీగ్ సందర్భంగా ఒక జట్టులోని ఆటగాళ్లు వరుసగా నమోదు చేసిన పరుగులు. విజయ్ హజారే వన్డే ట్రోఫీలో భాగంగా గ్రూప్-సిలో ఇక్కడ గురువారం బరోడాతో జరిగిన మ్యాచ్ లో త్రిపుర జట్టు ఘోర ప్రదర్శన ఇది. త్రిపుర కెప్టెన్ మురాన్ సింగ్ నమోదు చేసిన 10 పరుగులే అత్యధిక స్కోరు కాగా, కేవలం 22.2 ఓవర్లలో 58 పరుగులకే కుప్పకూలిన ఆ జట్టులో 16 పరుగులు ఎక్సట్రాలు రూపంలో రావడం గమనార్హం.
బరోడా బౌలరల్లో స్వప్నిల్ సింగ్ ఐదు , యూసఫ్ పఠాన్ మూడు వికెట్లు తీసి త్రిపుర బ్యాటింగ్ ఆర్డర్ ను కకావికలం చేశారు. ఆ తరువాత బ్యాటింగ్ చేపట్టిన బరోడా కూడా ఆదిలో తడబడి 42 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అయితే అంబటి రాయుడు(31 నాటౌట్), హార్థిక్ పాండ్యా(5 నాటౌట్)లు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడటంతో బరోడా 6.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మ్యాచ్ లో విజయంతో బరోడా 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, ఐదు మ్యాచ్ ల్లో ఓటమి చవిచూసిన త్రిపుర పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది.