చెత్త బ్యాటింగే కొంపముంచింది!
ఆంటిగ్వా:ఐదు వన్డేల సిరీస్లో భాగంగా వెస్టిండీస్ తో జరిగిన నాల్గో వన్డేలో భారత్ జట్టు ఓటమి చెందడం పట్ల బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. సాధారణ స్కోరును ఛేదించడంలో విఫలం కావడానికి బ్యాట్స్మెన్ల వైఫల్యమే ప్రధాన కారణమన్నారు. తమ కుర్రాళ్ల చెత్త బ్యాటింగ్ వల్ల గెలిచే మ్యాచ్ ను చేజార్చుకున్నామని బంగర్ అసహనం వ్యక్తం చేశాడు. 'విండీస్ విసిరిన లక్ష్యం కష్టమైనది ఎంతమాత్రం కాదు. మా బ్యాట్స్మెన్ స్ట్రైక్ రొటేట్ చేయడంలో విఫలయ్యారు.
ప్రధానంగా తొలి పది ఓవర్లలో కీలక వికెట్లు కోల్పోవడం కూడా మా ఓటమిపై ప్రభావం చూపింది. మరొకవైపు పిచ్ కూడా స్లోగా ఉంది. దాంతో షాట్ సెలక్షన్ అనేది అంత సులభం కాదనే విషయం అర్ధమైంది. అయినప్పటికీ ఇది చాలా తక్కువ స్కోరు. పటిష్ట బ్యాటింగ్ లైనప్ కల్గిన భారత్ జట్టు తన శక్తి సామర్ధ్యాలకు తగ్గట్టు ఆడకపోవడం వల్లే పరాజయం చెందాం. గెలవాల్సిన మ్యాచ్ ను చేజాతులా వదులుకున్నాం. దాంతో కడవరకూ వచ్చి పరాజయం చెందాల్సి వచ్చింది. ఓపెనర్ అజింక్యా రహానే అవుటయ్యే ముందు వరకూ మ్యాచ్ మా చేతుల్లోనే ఉంది. రహానే అవుటయ్యాక ఒక్కసారి పరిస్థితి మారిపోయింది. ఛేదనకు కావాల్సిన రన్ రేట్ పెరుగుతూ వచ్చింది'వరుసగా వికెట్లను కోల్పోయి ఓటమి అంచున నిలిచాం'అని బంగర్ తెలిపాడు. నాల్గో వన్డేలో 190 పరుగుల లక్ష్యాన్ని విండీస్ నిర్దేశించగా, భారత్ 178 పరుగులకు ఆలౌటైంది.