'మహిళా క్రికెట్ నుంచి నేర్చుకోండి'
ఆంటిగ్వా:ఇటీవల పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టుపై విజయం సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టుపై సంజయ్ బంగర్ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం భారత పురుషుల క్రికెట్ జట్టుకు బ్యాటింగ్ కోచ్ గా ఉన్న బంగర్.. వరుసగా మూడు విజయాలు సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టుకు అభినందనలు తెలియజేశాడు. ఈ క్రమంలోనే వెస్టిండీస్ తో నాల్గో వన్డేలో ఓటమి పాలైన పురుషుల క్రికెట్ జట్టుకు బంగర్ చురకలంటించాడు. భారత మహిళా క్రికెట్ జట్టు నుంచి స్ఫూర్తి పొందాలంటూ విరాట్ సేనకు సూచించాడు.
'ఇక్కడ మన భారత మహిళా క్రికెట్ జట్టును తప్పక అభినందించాలి. వన్డే వరల్డ్ కప్ లో హ్యాట్రిక్ విజయాలతో భారత మహిళలు దూసుకుపోతున్నారు. ఈ మేరకు పాకిస్తాన్ పై సాధించిన విజయం నిజంగా అద్భుతం. భారత మహిళలు తొలుత స్వల్ప స్కోరుకే పరిమితమైనా దాన్ని కాపాడుకుని విజయం సాధించారు. భారత మహిళలు 169 పరుగులు చేసినా బౌలింగ్ లో చెలరేగిపోయి పాకిస్తాన్ ను కట్టడి చేశారు. ఇక్కడ మన మహిళా క్రికెటర్లే పురుష క్రికెటర్లకు ఆదర్శం. వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. భారత పురుషుల జట్టు చాంపియన్స్ ట్రోఫీని సాధించడంలో విఫలమైన లోటును మహిళా క్రికెట్ జట్టు వరల్డ్ కప్ గెలిచి భర్తీ చేస్తుందని ఆశిస్తున్నా'అని బంగర్ పేర్కొన్నాడు.