
రహానే వర్సెస్ పాండే!
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు.. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన ట్వంటీ 20 సిరీస్ను క్లీన్స్వీప్ చేసి పొట్టి ఫార్మెట్ లో తమ సత్తాను చాటుకుంది. దీంతో పాటు టీ 20లో అగ్రస్థానానికి ఎగబాకింది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. త్వరలో భారత్ లో ప్రారంభమయ్యే వరల్డ్ టీ 20 జట్టు ఎంపికలో మాత్రం భారత సెలక్టర్లకు పరీక్ష ఎదురయ్యే అవకాశం కనబడుతోంది. ఆస్ట్రేలియాలో వన్డే, టీ20లో ఆడిన జట్టునే వరల్డ్ ట్వంటీ 20 కి దాదాపు ఎంపిక చేసే అవకాశం ఉన్నా.. ప్రత్యేకంగా ఇద్దరు స్టార్ ఆటగాళ్ల మధ్య ప్రధానంగా పోటీ ఏర్పడింది. ఒకరు అజింకా రహానే అయితే.. మరొకరు మనీష్ పాండే. ఆ ఇద్దరూ మిడిల్ ఆర్డర్ లో విశేషంగా రాణిస్తుండటమే వారి మధ్య పోటీకి కారణం.
కాగా, టీమిండియా ఎన్నాళ్ల నుంచో ఏడో స్థానంపై తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఇక్కడ సరైన ఆటగాడు లేకపోవడంతోనే టీమిండియా కీలక సమయాల్లో ఓటమి పాలవుతుందనేది అటు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో పాటు, సెలక్టర్ల భావన. దీనిని అధిగమించాలంటే ఆ స్థానాన్నిఎంత తొందరగా భర్తీ చేస్తే అంత మంచిదని బీసీసీఐ యోచిస్తోంది. ఈ క్రమంలోనే రహానే-మనీష్లు తెరపైకి వచ్చారు. మరోవైపు ఈ నెలలో శ్రీలంకతో జరిగే మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ కు యువరాజ్ తో పాటు, రహానే, మనీష్ పాండేలు ఎంపికయ్యారు.
ఇక్కడ విరాట్ కోహ్లికి విశ్రాంతినిచ్చినా.. యువరాజ్ ను, మనీష్లను పరీక్షించాలనేది టీమిండియా మొదటి ఆలోచన. ఆసీస్ తో చివరి టీ 20 అనంతరం యువీపై ధోని ఆశాభావం వ్యక్తం చేశాడు. మరికొన్ని మ్యాచ్ లు ఆడితే యువీ తన ఫామ్ ను అందుకుంటాడని పేర్కొన్నాడు. యువరాజ్ ను ఐదో స్థానంలో బ్యాటింగ్ కు పంపాలనే ఆలోచలో ఉన్నట్లు కూడా వెల్లడించాడు. దీనిలో భాగంగానే శ్రీలంకతో టీ 20 సిరీస్ కు యువీని ఎంపిక చేశారు. ఈ క్రమంలో ఆసియా కప్ తో పాటు, టీ 20 వరల్డ్ కప్ లో యువీకి చోటు దక్కడంతో పాటు, తుది జట్టులో ఆడే అవకాశం కూడా ఉంది.
ఇదిలా ఉంచితే ఆసియా కప్ తో పాటు, వరల్డ్ టీ 20కి ముందుగానే జట్టును ఎంపిక చేస్తుండటంతో రహానేకు మనీష్ పోటీగా నిలిచాడు. ఆసీస్ తో వన్డే సిరీస్ లో రహానే ఆకట్టుకున్నా.. ఆ తరువాత గాయం కారణంగా ఒక వన్డేతో పాటు, టీ 20 లకు దూరమయ్యాడు. కాగా, ఆఖరి వన్డేలో అద్భుతమైన శతకంతో ఆసీస్ కు షాకిచ్చిన మనీష్ పాండే ఒక్కసారిగా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. అయితే ఆసీస్ తో టీ 20 సిరీస్ లో పాండేకు ఆడే అవకాశం దక్కలేదు. కాగా, వరుసగా శ్రీలకంతో టీ 20 సిరీస్, ఆసియా టీ 20 టోర్నమెంట్ తో పాటు, వరల్డ్ టీ 20 జరుగుతున్న నేపథ్యంలో మనీష్ పాండేను ఏడోస్థానంలో పరీక్షించాలని టీమిండియా సెలక్టర్ల యోచనగా కనబడుతోంది.
భారత వరల్డ్ టీ 20 ప్రాబబుల్స్ లో రహానే, మనీష్ లకు అవకాశం కల్పించినా...తుది జట్టులో మాత్రం ఆ ఇద్దరిలో ఒకరు మాత్రమే ఆడే అవకాశం ఉంది. తొలి ఆరు స్థానాల్లో రోహిత్ శర్మ , శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, సురేష్ రైనా, యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోని జట్టులో ఉండే అవకాశం ఉండటంతో ఏడో స్థానం కోసమే పోటీ నెలకొంది. అటు ఫామ్ , క్లాస్ ను పరిశీలిస్తే మాత్రం రహానే వైపే సెలక్టర్లు మొగ్గు చూపే అవకాశం ఉన్నా, పాండే నుంచే గట్టి పోటీ తప్పకపోవచ్చు. శుక్రవారం ఆసియా కప్, వరల్డ్ టీ 20 లకు టీమిండియా జట్టును ఎంపిక చేయనున్న తరుణంలో రహానే, పాండేల పేర్లే సెలక్షన్ కమిటీలో చర్చనీయాంశంగా మారనున్నాయి.