
రంజీ ట్రోఫీ కావచ్చు లేదా విజయ్ హజారే ట్రోఫీ కావచ్చు... దులీప్ ట్రోఫీ లేదా దేవధర్ ట్రోఫీ కావచ్చు గత మూడు దశాబ్దాల్లో దేశవాళీ క్రికెట్‌లో ఎందరో ఆటగాళ్లు మారారు, విజేతగా నిలిచిన జట్లు కూడా మారుతూ వచ్చాయి. కానీ గత 33 ఏళ్లలో మారనిది సీతారామ్ తాంబే మాత్రమే. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలకు, అతనికి ఏమిటి సంబంధం అని ఆశ్చర్యపోతున్నారా... ఎక్కడ ఫైనల్ మ్యాచ్ జరిగితే ముంబై నుంచి అక్కడికి ఆ ట్రోఫీని తీసుకుపోవడం, బహుమతి ప్రదానోత్సవం జరిగాక దానిని తిరిగి తీసుకొచ్చి భద్రంగా కార్యాలయంలో ఉంచడమే అతని ఉద్యోగం.
ముంబై: 1985 జనవరిలో విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నార్త్‌జోన్, వెస్ట్ జోన్ జట్ల మధ్య దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో విజేతగా నిలిచే జట్టుకు అందించేందుకు ముంబై నుంచి ట్రోఫీ పంపించాల్సి వచ్చింది. అప్పటికే బీసీసీఐలో చిరుద్యోగిగా ఉన్న సీతారామ్ తాంబే దానిని రైలులో విజయవాడకు తీసుకెళ్లాడు. అంతే... అప్పటి నుంచి ఇప్పటి వరకు బోర్డులో ఎందరు అధికారులు మారినా ఈ బాధ్యతల నుంచి తాంబే మాత్రం దూరం కాలేదు. దేశవాళీ టోర్నీల్లో విజేత జట్టుకు అందించే అసలు ట్రోఫీలు ముంబైలోని బోర్డు ప్రధాన కార్యాలయంలోనే ఉంటాయి. టైటిల్ గెలిచిన వెంటనే ఆ జట్టుకు సదరు అసలు ట్రోఫీనే ఇస్తారు. కానీ విజయోత్సాహం ముగిసిన తర్వాత బోర్డు దానిని వెనక్కి తీసుకొని అదే తరహాలో ఉన్న రెప్లికాను మాత్రం తీసుకువెళ్లేందుకు అనుమతిస్తుంది. ఆ అసలు ట్రోఫీని మళ్లీ బీసీసీఐ కార్యాలయానికి తీసుకురావడం తాంబే చేయాల్సిన పని.
రైలు ప్రయాణాలే...
భారత దేశవాళీ సీజన్ ప్రారంభం కాగానే తాంబే పని పెరిగిపోతుంది. అసలు ట్రోఫీని తగిన విధంగా ప్యాక్ చేయడం, దానిని రైలులో జాగ్రత్తగా తీసుకువెళ్లి, మళ్లీ వెనక్కి తేవడం అంత సులువైన విషయం కాదు. ఇన్నేళ్లలో సీతారామ్ ‘ట్రోఫీ’ ప్రయాణమంతా దాదాపు 200 సార్లు రైళ్లలోనే సాగడం విశేషం. మొదట్లో రెండో తరగతి స్లీపర్ బెర్త్‌లో వెళ్లగా, ఇటీవలే రెండో తరగతి ఏసీలో ప్రయాణిస్తున్నాడు. ‘నా లగేజీలో ఏముందనేది తోటి ప్రయాణీకులకు ఎప్పుడూ చెప్పను. తనిఖీల్లో భాగంగా ఎవరైనా పోలీసులు అడిగితే మాత్రం బీసీసీఐ లేఖ చూపించి దాని గురించి వెల్లడిస్తా. ఒక్కసారి మాత్రమే రైల్వే పోలీసులు ప్యాకింగ్ విప్పించి ఇంత బరువైంది తీసుకు వెళ్లరాదని ఆపేశారు. అయితే తెలిసిన రైల్వే అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకున్నా’ అని ఒకింత ఆనందంగా సీతారామ్ గుర్తు చేసుకుంటాడు.
సమయానికి సిద్ధం...
అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని సార్లు ట్రోఫీని సంరక్షించుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుందని తాంబే చెప్పాడు. 2013 చెన్నైలో రంజీ ట్రోఫీ ఫైనల్‌కు ముందు ప్యాకింగ్ సమయంలో ట్రోఫీ పైభాగం కాస్త దెబ్బ తింది. ఇక ఈ ఏడాది ఆరంభంలో ఇండోర్‌లో జరిగిన ఫైనల్‌కు ముందు కూడా చిన్న సమస్య వచ్చింది. ‘మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం సీఈఓతో కలిసి ఫైనల్ ముందు రోజు అర్ధరాత్రి ఒక దుకాణానికి వెళ్లాం. కొన్ని గంటలు కూర్చొని దానిని సరి చేయించుకున్న తర్వాత ఫైనల్ సమయానికి దానిని సిద్ధంగా ఉంచగలిగాం’ అని అతను చెప్పాడు. 66 ఏళ్ల సీతారామ్ ఇప్పుడు బీసీసీఐలో అందరికంటే సీనియర్ ఉద్యోగి. తాను ఇష్టపడే ఆటతో విభిన్న తరహాలో అనుబంధం పెంచుకోవడం గర్వంగా అనిపిస్తుందని, శక్తి ఉన్నంత వరకు ఈ బాధ్యత నిర్వహిస్తానని తాంబే చెప్పడం విశేషం.
సచిన్‌కు సమాచారమిచ్చి...
ట్రోఫీల బాధ్యత స్వీకరించడానికి పదహారేళ్ల క్రితమే సీతారామ్ బీసీసీఐలో ఉద్యోగిగా చేరాడు. అప్పట్లో బోర్డుకు సంబంధించిన లేఖలు, టెలిగ్రామ్‌లు, సెలక్షన్‌కు సంబంధించిన సమాచారాన్ని ఆటగాళ్లు, అధికారులకు చేరవేయడం అతని విధి. 1989లో సచిన్ టెండూల్కర్ భారత జట్టుకు ఎంపికైనప్పుడు అతని ఇంటికి వెళ్లి సచిన్ తండ్రికి ఈ విషయాన్ని తెలియజేసిన వ్యక్తి తాంబేనే.
Comments
Please login to add a commentAdd a comment