ఎవరికెంత జీతం! | bcci fixed salary to cricketers after 31st | Sakshi
Sakshi News home page

ఎవరికెంత జీతం!

Published Fri, Dec 18 2015 12:29 AM | Last Updated on Sun, Sep 3 2017 2:09 PM

ఎవరికెంత జీతం!

ఎవరికెంత జీతం!

 -  బీసీసీఐ వెబ్‌సైట్‌లో క్రికెటర్లకు ఇచ్చే మొత్తం
  - ఈనెల 31 తర్వాత అందుబాటులోకి
  - భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న ఫ్రాంచైజీలు

 
 న్యూఢిల్లీ:
పరిపాలనలో పారదర్శకత తీసుకొస్తామని ప్రకటించిన బీసీసీఐ ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఐపీఎల్‌లో రిటేన్ చేసుకున్న ఆటగాళ్లకు ఫ్రాంచైజీలు చెల్లిస్తున్న ‘కచ్చితమైన జీతం’ వివరాలను బోర్డు వెబ్‌సైట్‌లో పెట్టనుంది. ఈనెల 31 తర్వాత ఇది అందుబాటులోకి రానుంది. అయితే దీనిపై ఫ్రాంచైజీల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం అమల్లోకి వస్తే... 2010 నుంచి రిటేన్ చేసుకున్న ఆటగాళ్లకు ఫ్రాంచైజీలు ఎన్ని డబ్బులు ఇస్తున్నాయనే వివరాలు బహిర్గతం చేయక తప్పదు. లీగ్ నిబంధన ప్రకారం రిటేన్ చేసుకున్న ఆటగాళ్లకు ఫ్రాంచైజీలు వరుసగా రూ. 12.5 కోట్లు; రూ. 9.5 కోట్లు; రూ. 7.5 కోట్లు; రూ. 5.5 కోట్లు; రూ. 4 కోట్లు ఇవ్వాలి. ఈ మొత్తం ఆయా ఫ్రాంచైజీల వేలం పర్సులో నుంచి తగ్గిపోతాయి. అయితే ఇదంతా కాగితాలపైనే కనిపిస్తున్నా వాస్తవంగా ఆయా క్రికెటర్లకు ఇంతకంటే పెద్ద మొత్తంలోనే డబ్బులు ముడుతున్నాయని సమాచారం.
 
 
 వ్యూహాలకు దెబ్బ: త్రైపాక్షిక (ఆటగాడు, ఫ్రాంచైజీ, బీసీసీఐ) ఒప్పందంలో భాగంగా ఆటగాళ్లకు ఎంత మొత్తం ఇస్తున్నారనే విషయం కచ్చితంగా బీసీసీఐకి తెలుస్తుంది. కానీ బహిరంగ ప్రజానీకానికి మాత్రం ఈ విషయం వెల్లడికాలేదు. ఇప్పుడు కూడా ఈ అంశాన్ని బహిర్గతం చేయడానికి కొన్ని ఫ్రాంచైజీలు ఇష్టపడటం లేదు. ఆటగాళ్లకు చెల్లిస్తున్న కచ్చితమైన జీతభత్యాలను వెల్లడిస్తే తమ వ్యాపార వ్యూహాలు దెబ్బతింటాయని సస్పెన్షన్‌కు గురైన చెన్నై సూపర్‌కింగ్స్ డెరైక్టర్లలో ఒకరు కాశీ విశ్వనాథన్ అన్నారు. ‘ఇవన్నీ వ్యాపార ప్రతిపాదనలు. అలాంటప్పుడు ఈ రహస్యాలను ఎలా బయటపెడతాం.
 
  గతంలో ధోని, రైనా, అశ్విన్, జడేజా, బ్రేవోలను మేం రిటేన్ చేసుకున్నాం. కానీ వాళ్లకు ఎంత ఇచ్చామన్నది ఎప్పుడూ చర్చల్లోకి రాలేదు’ అని విశ్వనాథన్ పేర్కొన్నారు. జీతం అంశాలు బయటకు వస్తే ఆటగాడు, ఫ్రాంచైజీల మధ్య చీలిక ఏర్పడుతుందని మరో ఫ్రాంచైజీ అధికారి అభిప్రాయపడ్డారు. ‘మేం ఎంతకు రిటేన్ చేసుకున్నామనే విషయం మిగతా వాళ్లకు ఎందుకు? ఏ ఆటగాడికి ఎంత ఇస్తున్నామన్నది ఇతర ఫ్రాంచైజీలకు తెలిస్తే ఒప్పందాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తారు. ఇది జట్టులో అశాంతిని రేపుతుంది. రిటేన్ చేసుకున్న భారత ఆటగాడి కంటే ఓ విదేశీ క్రికెటర్ మెరుగ్గా ఆడతాడనుకుందాం. కానీ వేలంలో రిటేన్ ఆటగాడికి చెల్లించే దానికంటే తక్కువగా వస్తే అతను ఎలా ఫీలవుతాడు. షేన్ వాట్సన్‌ను డ్రాఫ్ట్‌లో పుణే, రాజ్‌కోట్‌లో ఎవరూ తీసుకోలేదు. కారణం ఏంటంటే అతనికి రాజస్తాన్ చాలా పెద్ద మొత్తంలో చెల్లించిందని తేలడమే. అది వాట్సన్‌కు చాలా ఎక్కువని ఫ్రాంచైజీలు గ్రహించాయి’ అని సదరు అధికారి వివరించారు.
 
 
 బహిర్గతం చేయడమే మేలు
 మరోవైపు ఆటగాళ్ల జీతాలను బహిర్గతం చేయడానికి ఫ్రాంచైజీలు భయపడాల్సిన పనేలేదని ఓ ఫ్రాంచైజీ మాజీ అధికారి అన్నారు. ‘ఆటగాళ్ల జీతాల మధ్య తారతమ్యాలు ఉంటాయని ప్రతి ఒక్కరికీ తెలుసు. కాకపోతే రిటేనింగ్ వల్ల ఓ ఐదారు కేసుల్లో భారీ స్థాయిలో తేడాలు వచ్చే అవకాశం ఉంది. అంతమాత్రానికే ఈ విషయాలను బయటపెట్టలేమనడం సరైంది కాదు.
 
  బ్యాలెన్స్‌షీట్‌లో రాసినప్పుడు అడిటర్లకు తెలిసిపోతాయి. వాటిని ఎలాగూ మార్చలేం. కాబట్టి లిస్టెడ్ కంపెనీలు వాళ్ల బుక్స్‌ను బయటపెడితే తప్పేం లేదు. ఎక్కువ చెల్లించినా, తక్కువ ఇచ్చినా బీసీసీఐ పట్టించుకునే అవకాశమూ లేదు. వాళ్లకు కావాల్సింది వేలం పర్సు లెక్కలే. అయితే ఆటగాళ్లకు చెల్లిస్తున్న మొత్తం పారదర్శకంగా జరగడం లేదు. దీనివల్లే ఇవన్నీ’ అని మాజీ అధికారి వ్యాఖ్యానించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement