విజ్ఞప్తి + హెచ్చరిక
బీసీసీఐకి లేఖ రాసిన దక్షిణాఫ్రికా బోర్డు
ముంబై: రాబోయే డిసెంబర్‌లో భారత జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించడంపై వెంటనే స్పష్టత ఇవ్వాలని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్‌ఏ), బీసీసీఐకి లేఖ రాసింది. బోర్డు సీఈఓ రాహుల్ జోహ్రిని ఉద్దేశించి రాసిన ఈ లేఖలో డిసెంబర్ 26 (బాక్సింగ్ డే) నుంచి తొలి టెస్టు ఆడే విధంగా భారత్ తమ పర్యటనను ఖరారు చేయాలని సీఎస్‌ఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హరూన్ లొర్గాత్ కోరారు. అయితే ఈ విజ్ఞప్తికి మరో హెచ్చరికను కూడా సీఎస్‌ఏ జోడించింది. ఈ సిరీస్‌లో పాల్గొంటేనే వచ్చే ఐపీఎల్‌లో ఆడేందుకు తమ ఆటగాళ్లను అనుమతి ఇస్తామన్నట్లుగా కూడా పరోక్షంగా హెచ్చరించింది. అయితే దీనిని జోహ్రి తేలిగ్గా కొట్టి పారేశారు. లేఖ తమకు అందిందని నిర్ధారించిన ఆయన సరైన సమయంలోనే దానికి స్పందిస్తామన్నారు.
‘మేం దానిని అసలు పట్టించుకోం. ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందని మేం భావించడం లేదు. మే 8 వరకే ఈ ఐపీఎల్‌లో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు పాల్గొంటారనేది అందరికీ తెలుసు. వాళ్లంతా వెళ్లిపోయారు. ఈ సమయంలో రచ్చ అనవసరం’ అని జోహ్రి వ్యాఖ్యానించారు. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత భారత్ పాల్గొనే సిరీస్‌ల విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. సీఎస్‌ఏ కోరుతున్న సిరీస్ ఇంకా చర్చల దశలోనే ఉంది. అయితే గతంలో నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్‌లో పాకిస్తాన్‌తో భారత్ ఆడాల్సి ఉండగా... ఆ జట్టు స్థానంలో న్యూజిలాండ్ భారత పర్యటనకు రావచ్చు.