పింక్ బంతుల కోసం బీసీసీఐ చర్చలు
న్యూఢిల్లీ: డే నైట్ టెస్టులకు వినియోగించే పింక్ బంతుల సరఫరా కోసం బీసీసీఐ... ప్రముఖ బ్రిటిష్ కంపెనీ ‘డ్యూక్’తో సంప్రదింపులు జరుపుతోంది. ఈ ఏడాది చివర్లో భారత్.. న్యూజిలాండ్తో జరగనున్న డేనైట్ టెస్టుకు వీటిని ఉపయోగిస్తామని బీసీసీఐ కార్యదర్శి అజయ్ షిర్కే తెలిపారు. అయితే బంతి ఉపయోగం, మన్నిక వంటి చాలా అంశాలపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయన్నారు. భారత్లో జరిగే మ్యాచ్లకు ఎక్కువగా ‘ఎస్జీ టెస్టు’ బంతులను వాడుతుండగా, ఇంగ్లండ్లో ‘డ్యూక్’, విండీస్తో పాటు ఇతర దేశాల్లో ‘కూకాబురా’ బాల్స్ను వినియోగిస్తున్నారు. అయితే కూకాబురాతో పోలిస్తే డ్యూక్ బంతుల్లో సీమ్ కాస్త మందంగా ఉండటం భారత బౌలర్లకు బాగా లాభిస్తుందని బీసీసీఐ సాంకేతి కమిటీ చైర్మన్ సౌరవ్ గంగూలీ చెప్పడంతో బోర్డు దీనిపై దృష్టిపెట్టింది. మరోవైపు భారత్తో డేనైట్ టెస్టు ఆడేందుకు కివీస్ సుముఖంగా లేదని వస్తున్న వార్తలను షిర్కే తోసిపుచ్చారు.
కోచ్ రేసులో 21 మంది..
భారత జట్టు కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్న 57 మందిలో 21 మందిని షార్ట్లిస్ట్ చేసినట్లు షిర్కే తెలిపారు. సచిన్, గంగూలీ, లక్ష్మణ్లతో కూడిన సలహా కమిటీకి వారి జాబితాను పంపుతామని, తుది నిర్ణయంపై కమిటీ సూచనలిస్తుందన్నారు. ఈనెల 22లోపు కమిటీ రిపోర్ట్ను అనురాగ్ ఠాకూర్ సమర్పిస్తుంది. కమిటీ మాజీ సెలక్టర్ సంజయ్ జగ్దలే సహకారాలు అందించనున్నారు.