ఆ ఇద్దరూ బెట్టింగ్‌ చేశారు | BCCI or CSK, choose one | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరూ బెట్టింగ్‌ చేశారు

Published Fri, Jan 23 2015 12:46 AM | Last Updated on Sat, Sep 2 2017 8:05 PM

ఆ ఇద్దరూ బెట్టింగ్‌  చేశారు

ఆ ఇద్దరూ బెట్టింగ్‌ చేశారు

గురునాథ్, రాజ్ కుంద్రాలపై ఆధారాలున్నాయి

శిక్షను ఖరారు చేసేందుకు త్రిసభ్య కమిటీ
ఆరు వారాల్లో బీసీసీఐ ఎన్నికలు జరగాలి
చెన్నైని వదులుకుంటేనే శ్రీనివాసన్ పోటీ చేయాలి
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌లపై సుప్రీం కోర్టు తుది తీర్పు

 
 న్యూఢిల్లీ: ఐపీఎల్-6లో రాజస్తాన్ రాయల్స్ సహ యజమాని రాజ్ కుంద్రా, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ప్రిన్సిపల్ గురునాథ్ మెయ్యప్పన్ బెట్టింగ్‌కు పాల్పడ్డారని సుప్రీం కోర్టు నిర్ధారించింది. ఈ ఇద్దరికీ విధించాల్సిన శిక్షను నిర్ణయించేందుకు ముగ్గురు మాజీ న్యాయమూర్తులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఇద్దరితో పాటు చెన్నై, రాజస్తాన్ జట్ల భవితవ్యాన్ని కూడా ఈ కమిటీ ఆరు నెలల్లో నిర్ణయించాలని ఆదేశించింది. జస్టిస్ టీఎస్ ఠాకూర్, ఎఫ్‌ఎంఐ ఖలీఫుల్లాలతో కూడిన బెంచ్ 138 పేజీల తమ తుది తీర్పును దాదాపు గంటన్నర పాటు చదివి వినిపించింది.
 
తీర్పులోని ముఖ్యాంశాలు
 
 ⇒ గురునాథ్, కుంద్రాలకు శిక్షను ఖరారు చేసేందుకు మాజీ చీఫ్ జస్టిస్ ఆర్.ఎం.లోధా నేతృత్వంలో త్రిసభ్య కమిటీ ఏర్పాటు. ఇందులో మాజీ జడ్జిలు అశోక్ భాను, ఆర్.వి.రవీంద్రన్ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ముందుగా ఈ ఇద్దరితో పాటు జట్లకు నోటీసులు ఇచ్చి ఆరు నెలల్లోగా నివేదికను కోర్టుకు అందించాలి.
   
బీసీసీఐ రాజ్యాంగంలో ఎలాంటి మార్పులు తీసుకోవాలో కూడా కమిటీ సూచిస్తుంది. గతంలో ముద్గల్ కమిటీ తనకు ముందుగా నోటీసులు ఇవ్వలేదనే కుంద్రా వాదన పస లేనిది.
     
ఐపీఎల్‌లో ఫ్రాంచైజీ కొనుగోలు కోసం బీసీసీఐ 6.2.4 నిబంధనకు సవరణ చేయడం దారుణం. దీని ద్వారా పర స్పర విరుద్ధ ప్రయోజనాల ఘర్షణ చోటుచేసుకుంది. ఈ కేసులో ఇదే పెద్ద విలన్.. ఈ నిబంధనకు స్వస్తి పలకాలి.
     
ఆరు వారాల్లో బీసీసీఐ ఏజీఎం జరుపుకోవచ్చు. అవసరమైతే ఎన్నికలూ నిర్వహించుకోవచ్చు. చెన్నై సూపర్ కింగ్స్ యజమానిగా వ్యాపార ప్రయోజనాలు ఉన్నంత వరకు ఎన్.శ్రీనివాసన్ బీసీసీఐ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదు. చెన్నైని వదులుకుంటే ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. సీఎస్‌కే యజమానిగా ఉండాలా? బీసీసీఐ అధ్యక్షుడిగానా ఏదో ఒకటి శ్రీని నిర్ణయించుకోవాలి. ఇతర బోర్డు అధికారులు కూడా ఐపీఎల్‌లో వాణిజ్య ప్రయోజనాలున్నంత వరకు ఎన్నికలకు దూరంగా ఉండాలి.
     
గురునాథ్‌ను కాపాడేందుకు శ్రీనివాసన్ ప్రయత్నించారనడానికి ఎలాంటి ఆధారాలు లేవు.
     
ఓ బుకీతో సంబంధాలు కలిగిన ఐపీఎల్ సీవోవో సుందర్ రామన్‌పై కూడా త్రిసభ్య కమిటీ విచారణ జరుగుతుంది. దోషిగా తేలితే శిక్ష పడుతుంది.
 
బోర్డు ప్రైవేట్ సంస్థ కాదు

ఈ కేసు తీర్పు సందర్భంగా బీసీసీఐ తీరును సుప్రీం కోర్టు ప్రశ్నించింది. కోట్లాది మంది భారతీయులకు క్రికెట్‌పై ఉన్న ఆసక్తిని, మమకారాన్ని సొమ్ము చేసుకుంటూ కార్యకలాపాలు నడుపుతున్నప్పుడు ఇది ప్రైవేట్ సంస్థ ఎలా అవుతుందని నిలదీసింది. బోర్డు కార్యకలాపాలన్నీ ప్రజలకు సంబంధించినవేనని, తమ అధికారాలను సవాల్ చేసే అధికారం ప్రభుత్వాలకు లేదని బోర్డు వాదించడం అర్థరహితమని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం ఇస్తున్న భారతరత్న, పద్మ అవార్డులను బీసీసీఐ సూచనల మేరకు క్రికెటర్లకు ఇస్తున్నారని న్యాయస్తానం గుర్తు చేసింది. ఈ మొత్తం కేసులో విచారణ చేపట్టి నివేదిక అందించిన ముద్గల్... కోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు అన్ని క్రీడాసంఘాలకు వర్తిస్తాయని అభిప్రాయపడ్డారు.
 
నిర్ణయం ఆయనదే

సుప్రీం కోర్టు తీర్పుపై బీసీసీఐ ఆచితూచి వ్యవహరిస్తోంది. కోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నామని ఆరు వారాల్లోపు ఎన్నికలకు వెళతామని ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీనివాసన్‌కు క్లీన్ చీట్ ఇవ్వడంపై బోర్డు వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. అయితే చెన్నై జట్టును వదులుకోవడమా? లేక బోర్డు పదవిని వదులుకోవడమా? అనే అంశంపై నిర్ణయం తీసుకోవాల్సింది ఆయనే అని బోర్డు పెద్దల్లో ఒకరు వ్యాఖ్యానించారు. ప్రతి అంశంలోనూ న్యాయసలహా తీసుకున్నాకే నిర్ణయాలు తీసుకోవాలని బోర్డు పెద్దలు భావిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై శ్రీనివాసన్ స్పందించేందుకు నిరాకరించారు. అయితే ఆయన ప్రత్యర్థి వర్గాలు మాత్రం... తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందని సంబరాలు చేసుకున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement