ఐపీఎల్ హక్కులకు ఓపెన్ టెండర్లు
న్యూఢిల్లీ: క్రికెట్ ప్రపంచంలో సూపర్ హిట్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రసార హక్కుల కోసం మళ్లీ పోటీ మొదలైంది. 2018 ఐపీఎల్ నుంచి వర్తించే విధంగా కొత్త ఒప్పందం కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బహిరంగ టెండర్ ప్రక్రియ ద్వారా ఆసక్తి గల సంస్థల నుంచి దరఖాస్తులు కోరింది. ‘ఐపీఎల్ టోర్నీ గ్లోబల్ మీడియా హక్కుల (టీవీ, డిజిటల్) కోసం టెండర్లను ఆహ్వానిస్తున్నాము’ అని బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. 2008లో ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి 2017 వరకు పదేళ్ల కాలానికి టీవీ హక్కులు సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ ఇండియా (ఎస్‌పీఎన్‌ఐ) వద్ద ఉన్నాయి. వచ్చే ఏడాది ఈ ఒప్పందం ముగియనుండటంతో బీసీసీఐ కొత్త ఆఫర్‌కు సిద్ధమైంది. తాజా ప్రకటనలో ఎన్నేళ్ల కాలానికి హక్కులు కేటారుుస్తారనేదానిపై స్పష్టత ఇవ్వలేదు.
రాజీ కుదరలేదు...
లోధా కమిటీ సిఫారసుల అమలులో భాగంగా మరింత పారదర్శకత కోసం ఓపెన్ టెండర్లను కోరుతున్నట్లు బీసీసీఐ అధికారులు ప్రకటించారు. అయితే ప్రస్తుతం హక్కులు ఉన్న సోనీ సంస్థ దీనిపై అసంతృప్తితో ఉంది. 2008లో చేసుకున్న ఒప్పందం ప్రకారం కొత్తగా మళ్లీ హక్కులు ఇచ్చే సమయంలో ముందుగా తమతో చర్చించాలని, తాము ఒక వేళ తిరస్కరిస్తే అప్పుడే మరొకరికి అవకాశం ఇవ్వాలని చెబుతోంది. ఐపీఎల్-2016 ఫైనల్ ముగిసిన తర్వాత రెండు నెలల కాలంలో సోనీ, బీసీసీఐ మధ్య అనేక సార్లు చర్చలు జరిగినట్లు సమాచారం.
అరుుతే ఎంత మొత్తానికి హక్కులు ఇవ్వాలనే అంశంపై రాజీ కుదరలేదని తెలిసింది. సోనీ ఆఫర్ చేసిన మొత్తం ఆమోదయోగ్యం కాకపోగా... ఓపెన్ టెండర్లోనే పాల్గొనాలంటూ వారికి బోర్డు సూచన ఇచ్చిందని సీనియర్ సభ్యుడొకరు వెల్లడించారు. అయితే ఐపీఎల్‌పై ఎవరూ ఆసక్తి చూపించని సమయంలో తాము ముందుకొచ్చామని, ఇప్పుడు లీగ్‌కు ఉన్న స్థాయికి చేర్చేందుకు తాము ఎన్నో రకాలుగా శ్రమించామని సోనీ వాదిస్తోంది. అవసరమైతే ఓపెన్ ప్రక్రియను కోర్టులో సవాల్ చేయాలని కూడా సంస్థ భావిస్తోంది.