ముంబై: ఇటీవల విడుదల చేసిన ఆసియా కప్ క్రికెట్ షెడ్యూల్‌పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఆగ్రహం వ‍్యక్తం చేసింది. అసలు బుర్ర పెట్టే షెడ్యూల్‌ను సిద్ధం చేశారా అంటూ మండిపడింది. యూఏఈ వేదికగా సెప్టెంబర్‌లో ఆసియాకప్ జరుగునున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు విడుదల చేసిన షెడ్యూల్ గందగరగోళానికి గురి చేసింది. ప్రధానంగా భారత్ వెంట వెంటనే రెండు మ్యాచ్‌లు ఆడి రావడంపై బీసీసీఐ అసహనానికి కారణమైంది.
సెప్టెంబర్ 19వ తేదీన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అయితే షెడ్యూలు ప్రకారం ముందు రోజు ఒక క్వాలిఫయర్ మ్యాచ్‌లో టీమిండియా తలపడనుంది. ఇది గమనించిన బీసీసీఐ ‘ప్రణాళిక సిద్ధం చేసేముందు కొంతైనా ముందూ వెనకా ఆలోచించరా’ అంటూ నిర్వాహకులపై అక్కసు వెళ్లగక్కింది. ‘ఈ రోజు మ్యాచ్ ఆడిన దేశం రేపటి మ్యాచ్‌కు వెంటనే ఎలా సిద్ధపడుతుంది? అందులోనూ ఇదేమైనా సాధారణమైన మ్యాచా? భారత్- పాక్‌ల మధ్య క్రికెట్ మ్యాచ్. పాక్‌కేమో రెండు రోజులు విరామం ఇచ్చారు. భారత్ మాత్రం ఎటువంటి విరామం లేకుండా మ్యాచ్‌కు సిద్ధపడాలా..?, ఇది బుర్రలేని షెడ్యూల్. దీన్ని ఎంతమాత్రం అంగీకరించలేం. ఆ మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేయాల్సిందే’ అని బీసీసీఐ డిమాండ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment