బెన్ స్టోక్స్ (ఫైల్)
జోహెన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాతో జరగనున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఆడే అవకాశాలు కనబడటం లేదు. తీవ్ర అనారోగ్యంతో అతడి తండ్రి గెడ్ స్టోక్స్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో ఆయనకు జోహెన్నెస్‌బర్గ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. దీంతో బెన్ స్టోక్ మంగళవారం తండ్రి దగ్గరే ఆస్పత్రిలో ఉండిపోయాడని, ప్రాక్టీసుకు కూడా రాలేదని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) తెలిపింది. న్యూజిలాండ్ రగ్బీ మాజీ ఆటగాడైన గెడ్ స్టోక్స్ తీవ్ర అనారోగ్యం బారిన పడటంతో సోమవారం ఆస్పత్రిలో చేర్చినట్టు వెల్లడించింది. ఇటువంటి సమయంలో బెన్ స్టోక్స్, అతడి కుటుంబానికి అండదండలు అందిస్తామని ఈసీబీ ప్రకటించింది. బెన్ స్టోక్స్, అతడి కుటుంబ సభ్యుల ఏకాంతాన్ని భంగపరచవద్దని మీడియా, ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా ప్రిటోరియా సమీపంలోని సెంచూరియన్‌లో ఇంగ్లండ్-దక్షిణాఫ్రికా మొదటి మ్యాచ్ గురువారం ప్రారంభం కానుంది. బెన్ స్టోక్స్ బరిలోకి దిగకపోతే ఇంగ్లండ్ జట్టుకు ఎదురుదెబ్బ తగలినట్టే. బీబీసీ ‘స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్’ గా ఎంపికైన స్టోక్స్ ఈ ఏడాది అద్భుతంగా రాణించాడు. ఇంగ్లండ్ వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. జ్వరంతో బాధపడుతున్న ప్రధాన బౌలర్లు జోఫ్రా ఆర్చర్, స్టువర్ట్ బ్రాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌కు దూరమయ్యారు. తొలి టెస్ట్ నాటికి వారిద్దరూ కోలుకుంటారని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో బెన్ స్టోక్స్ కూడా జట్టుకు దూరమైతే ఇంగ్లండ్‌కు కష్టాలు తప్పవు.
Comments
Please login to add a commentAdd a comment