తెలుగు టైటాన్స్‌కు మరో ఓటమి
సాక్షి, విశాఖపట్నం: ప్రొ కబడ్డీ లీగ్‌లో సొంతగడ్డపై తమ పోరాటాన్ని తెలుగు టైటాన్స్ జట్టు ఓటమితో ముగించింది. మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 17-25 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌తో విశాఖపట్నంలో ప్రొ కబడ్డీ లీగ్ దశ పోటీలు ముగిశాయి. తొలి మ్యాచ్‌లో ఓడిపోయి... తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి జోరు మీదున్నట్లు కనిపించిన టైటాన్స్ జట్టుకు బెంగాల్ జట్టు షాక్ ఇచ్చింది. దాంతో టైటాన్స్ సొంతగడ్డపై ‘హ్యాట్రిక్’ విజయాలను నమోదు చేయడంలో విఫలమైంది.
తొలి అర్ధభాగంలో రెండు జట్లు నువ్వా నేనా అన్నట్లు పోరాడాయి. ఫలితంగా విరామ సమయానికి రెండు జట్లు 9-9తో సమఉజ్జీగా నిలిచాయి. రెండో అర్ధభాగం తొలి ఐదు నిమిషాల్లోనూ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. స్కోరు 14-14తో సమంగా ఉన్న దశలో బెం గాల్ జట్టు వరుసగా మూడు పాయింట్లు సాధించి 17-14తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఇదే జోరును కనబరిచిన బెంగాల్ నిలకడగా రాణించి విజ యాన్ని ఖాయం చేసుకుంది.
టైటాన్స్ జట్టు లో రోహిత్ బలియాన్, రాహుల్ చౌదరీ నాలుగేసి పాయింట్లు స్కోరు చేశారు. బెంగాల్ జట్టులో నితిన్ తోమర్ ఆరు పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలువగా... గిరీవ్ మారుతి ఐదు పాయింట్లు... నీలేశ్ షిండే, మహేశ్ గౌడ్, మహేంద్ర గణేశ్ రాజ్‌పుత్ మూడేసి పాయింట్లు సాధించారు. బుధవారం బెంగళూరు వేదికగా జరిగే మ్యాచ్‌ల్లో బెంగళూరు బుల్స్‌తో పట్నా పైరేట్స్; దబంగ్ ఢిల్లీతో పుణేరి పల్టన్ తలపడతాయి.