భువీ మరో అరుదైన ఘనత
హైదరాబాద్: సన్ రైజర్స్ హైదరాబాద్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చరిత్రలో వంద వికెట్లను సాధించిన క్లబ్ లో చేరిపోయాడు. సోమవారం కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 5 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన భువీ.. ఐపీఎల్ లో 100 వికెట్ల మార్కును చేరాడు. మరొకవైపు అతి తక్కువ మ్యాచ్ ల్లో ఈ రికార్డు నమోదు చేసిన రెండో బౌలర్ గా గుర్తింపు పొందాడు. అంతకుముందు ముంబై ఇండియన్స్ ఆటగాడు లసిత్ మలింగా అతి తక్కువ మ్యాచ్ ల్లో వంద వికెట్లను సాధించిన తొలి ఆటగాడిగా ఉన్నాడు. లసిత్ మలింగా 70 మ్యాచ్ లో ఈ ఘనత సాధించగా, భువీ 81 మ్యాచ్ ల్లో సాధించాడు.
ఇదిలా ఉంచితే, 2014 నుంచి సన్ రైజర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న భువీ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. ఓటములకు అడ్డు గోడలా నిలిచి జట్టును విజయాల తీరం వైపు మళ్లిస్తున్నాడు. భువీ పొదుపు బౌలింగ్ తో స్వల్ప లక్ష్యాలను సైతం కాపాడుకుంటూ సన్ రైజర్స్ హైదరాబాద్ విజయ డంకా మోగిస్తుంది. 2016 సీజన్లో 17 మ్యాచ్ లు ఆడిన భువీ 23 వికెట్లతో అగ్రస్దానంలో నిలిచి జట్టు ఛాంపియన్ గా నిలవడంలో కీలక పాత్ర పోశించాడు. సన్ రైజర్స్ లో చేరిన తర్వాత భువీ తన బౌలింగ్ ప్రతిభను చాటాడు. 2014లో 20 మ్యాచ్ లు ఆడి 20 వికెట్లతో బౌలర్ల పాయింట్ల పట్టికలో మూడో స్ధానంలో నిలిచాడు. 2015 లో 18 వికెట్లు పడగొట్టాడు. అంతకు ముందు 2010 నుంచి 2013 వరకు అప్పటి జట్టు పుణే వారియర్స్ ఇండియా తరుపు ఆడి 25 వికెట్లు తీశాడు. 2008-2009 సీజన్ లో బెంగళూరుకు ఎంపికైన భువీకి అంతగా అవకాశం రాలేదు.