
భువనేశ్వర్ కుమార్
హైదరాబాద్ : టీమిండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా కొంటె పనికి పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నామని, అతనితో ఎక్కడకి వెళ్లకూడదని సహచర ఆటగాళ్లు రోహిత్ శర్మ, అజింక్యా రహానేలు ఇటీవల తెలిపిన విషయం తెలిసిందే. అయితే తాజాగా జడేజా నోటా అన్ని అబద్దాలేనని పేసర్ భువనేశ్వర్ కుమార్ తెలిపాడు. గౌరవ్‌కపూర్ ‘బ్రేక్‌ఫాస్ట్ విత్ చాంపియన్స్’ షోలో పాల్గొన్న భువీ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
‘భారత క్రికెటర్లలో రవీంద్ర జడేజా ఎక్కువగా అబద్ధాలు చెబుతాడు. ఈ విషయం జట్టులోని ఆటగాళ్లందరికీ తెలుసు. ఇక జడేజాకు కెప్టెన్ విరాట్ కోహ్లి అంటే చాలా భయం. కోహ్లి తన చుట్టుపక్కల ఉన్న సమయంలో జడేజా ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తాడు. చాలా తక్కువగా మాట్లాడుతాడు. ఎందుకంటే.. ఒకవేళ అబద్ధం చెప్పినట్లు కోహ్లికి తెలిస్తే బాగా ఆటపట్టిస్తాడని జడేజా భయం. శిఖర్ ధావన్‌కు ఏమి చెప్పినా గుర్తుండదు. ఒక్కోసారి జట్టు సభ్యుల పేర్లు కూడా మర్చిపోతుంటాడు. ఎంతలా అంటే అందరం కలిసి భోజనం చేసేటప్పుడు డైనింగ్ టేబుల్‌పై అతనికి ఎదురుగా కూర్చున ఆటగాడి పేరు కూడా గుర్తుండదు. అతడిని పిలిచేందుకు ఆలోచిస్తూ ఉంటాడు’ అని భువీ చెప్పుకొచ్చాడు.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను తొలి సారి చూసినప్పుడు ఏం మాట్లాడలేకపోయానని ఆనాటీ రోజులను భువీ గుర్తు చేసుకున్నాడు. ‘దేశవాళీ మ్యాచ్ కోసం మైదానానికి వెళ్లేందుకు నేను గదిలో నుంచి బయటకు వచ్చాను. ఇంతలో ఎవరో వచ్చి గది తలుపు కొడుతూ ఉన్నారు. ఎవరా? అని వెనక్కి తిరిగి చూస్తే.. సచిన్. తొలిసారి సచిన్‌ను చూడటం అప్పుడే. ఇద్దరం కలిసి లిఫ్ట్‌లో కిందకు వెళ్లాం. ఆ సమయంలో నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. సచిన్ మాత్రం నన్ను విష్ చేశాడు. అప్పుడు జరిగిన మ్యాచ్‌లో నేను సచిన్‌ను డకౌట్ చేశాను. టీమిండియాలో చోటు దక్కిన కొత్తలో నేను డ్రెస్సింగ్ రూమ్‌లో పెద్దగా మాట్లాడకపోయేవాడిని. చాలా రిజర్వ్‌డ్‌గా ఉండేవాడిని. ఏదైనా చెప్పాల్సి వస్తే ఇషాంత్ శర్మకు చెప్పేవాడిని’ అని యూపీ ఆటగాడు చెప్పుకొచ్చాడు.