కోహ్లీ సక్సెస్ సీక్రెట్ లీక్ అయింది!
బెంగళూరు: ఐపీఎల్-9 తొలి దశలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆటకు ప్రస్తుతం వారి హార్డ్ హిట్టింగ్ షో ఇన్నింగ్స్ లకు ఎలాంటి సంబంధమే లేదు. అప్పుడు వరుస ఓటములు.. ఇప్పుడు భారీ విజయాలతో ప్రత్యర్థి జట్లను అలవోకగా మట్టికరిపిస్తూ ప్లే ఆఫ్స్ కు దూసుకుపోతోంది. బుధవారం రాత్రి చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ జట్టును 82 పరుగుల భారీ తేడాతో బెంగళూరు విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం బెంగళూరు బౌలర్ యుజువేంద్ర చాహల్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నాడు. బెంగళూరు టాప్-4 బ్యాట్స్ మన్ కు బౌలింగ్ చేయాలనుకుంటాన్నారా అన్న ప్రశ్నకు.. వామ్మో వారికి బౌలింగ్ చేయాలని మాత్రం తాను భావించడం లేదని చెప్పాడు. విరాట్ భారీ ఇన్నింగ్స్ ల సీక్రెట్ గురించి కూడా మాట్లాడాడు.
కోహ్లీ ఫిట్ నెస్ కు చాలా ప్రాధాన్యమిస్తాడని, అందుకే జిమ్ లో ఎక్కువ సమయం గడుపుతాడని చాహల్ అన్నాడు. నెట్స్ లో అధికంగా శ్రమించడం కోహ్లీకి కలిసొచ్చిందని, పిచ్ మధ్యలోకి వచ్చి సిక్స్ లు కొట్టడం ప్రాక్టీస్ చేయడంతో సులువుగా భారీ షాట్లు కొడుతున్నాడని తమ జట్టు కెప్టెన్ సక్సెస్ సీక్రెట్ ను వెల్లడించాడు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, షేన్ వాట్సన్ లాంటి ఆటగాళ్లు ఉంటడం బెంగళురుకు కలిసొచ్చే అంశమని చెప్పుకొచ్చాడు. బౌలర్లు రాణించడంతో టోర్నీలో పాయింట్ల పట్టికలో తమ జట్టు రెండో స్థానానికి చేరుకుందన్నాడు. బెంగళూరు విజయాలలో బ్యాట్స్ మన్ మాత్రమే కాదు బౌలర్లు కూడా కీలకపాత్ర పోషిస్తున్నామని ఆ జట్టు బౌలర్ యుజువేంద్ర చాహల్ అభిప్రాయపడ్డాడు. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరడంలో బౌలర్లు కూడా తీవ్రంగా శ్రమించారని, ముఖ్యంగా జోర్డాన్ రాకతో తమ బౌలింగ్ మరింత బలోపేతమైందని చెప్పాడు. తొలి రెండు మ్యాచులలో అంతగా రాణించని జోర్డాన్ కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో రాణించాడు.