భారత్ తో జరుగుతున్న మూడో వన్డేలో శ్రీలంక 218 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
పల్లెకెలె: భారత్ తో జరుగుతున్న మూడో వన్డేలో శ్రీలంక 218 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బౌలింగ్ దాటికి తలవంచిన లంకేయులు సాధారణ స్కోరుకే పరిమితమయ్యారు. ప్రధానంగా గత మ్యాచ్ లో నాలుగు వికెట్లతో మెరిసిన భారత పేసర్ బూమ్రా..ఈ మ్యాచ్ లో సైతం ఐదు వికెట్లతో చెలరేగి లంకను కట్టడి చేశాడు. 10 ఓవర్లు పూర్తి కోటా బౌలింగ్ వేసిన బూమ్రా రెండు మెయిడిన్ల సాయంతో 27 పరుగులివ్వడం మరో విశేషం.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ కు దిగిన లంకేయులు ఆదిలోనే తడబడ్డారు. 28 పరుగులకే రెండు ప్రధాన వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డారు. ఆ తరుణంలో చండిమాల్- తిరిమన్నే జో్డి 72 పరుగుల భాగస్వామ్యాన్నిజత చేయడంతో లంక తేరుకుంది. అయితే జట్టు స్కోరు వంద పరుగుల వద్ద చండిమాల్(36) మూడో వికెట్ గా అవుట్ కావడంతో లంక మరోసారి తడబడినట్లు కనబడింది. కాగా,తిరిమన్నే బాధ్యతాయుతంగా ఆడి జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లాడు.
ఈ క్రమంలోనే 69 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ సమయంలోనే ఏంజెలో మాథ్యూస్(11) నిరాశపరిచడంతో జట్టు పూర్తి ఆత్మరక్షణలో పడింది. ఆపై తిరిమన్నే(80) కూడా పెవిలియన్ చేరడంతో లంక వరుసగా వికెట్లను చేజార్చుకుంది. 51 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లను కోల్పోవడంతో లంక నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 217 పరుగులు చేసింది. చండిమాల్-తిరిమన్నే తరువాత సిరివర్దనే(29)ఒక్కడే కాస్త ఫర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో బూమ్రాకు తోడుగా, హార్దిక్, అక్షర్ పటేల్, కేదర్ జాదవ్ లకు తలో వికెట్ సాధించారు.