
సిడ్నీ: ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి భారత జట్టు టెస్టు సిరీస్ నెగ్గడంలో కీలకపాత్ర పోషించిన పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చారు. ఈనెల 12 నుంచి ఆస్ట్రేలియాతో... అనంతరం 23 నుంచి న్యూజిలాండ్‌తో మొదలయ్యే మూడు వన్డేల సిరీస్‌లలో బుమ్రా బరిలోకి దిగడం లేదని బీసీసీఐ ప్రకటించింది. బుమ్రా స్థానంలో హైదరాబాద్ పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్‌ను తొలిసారి వన్డే జట్టులోకి ఎంపిక చేశారు. ‘ఫిబ్రవరిలో భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటించనుంది.
ఈ నేపథ్యంలో బుమ్రాకు తగిన విశ్రాంతి ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావించింది. అతని స్థానంలో సిరాజ్‌ను ఎంపిక చేశాం. న్యూజిలాండ్‌తో జరిగే టి20 సిరీస్‌కు పంజాబ్ బౌలర్ సిద్ధార్థ్ కౌల్‌ను కూడా జట్టులోకి తీసుకున్నాం’ అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఏడాది క్రితమే టెస్టుల్లో అరంగేట్రం చేసిన 25 ఏళ్ల బుమ్రా 10 టెస్టులు ఆడి 49 వికెట్లు తీశాడు. మరోవైపు 24 ఏళ్ల సిరాజ్ 2017 నవంబర్‌లో రాజ్‌కోట్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టి20 ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టాడు. మూడు టి20 మ్యాచ్‌లు ఆడిన అతను మూడు వికెట్లు తీశాడు.