కరాచీ: స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఐదేళ్ల నిషేధాన్ని ఎదుర్కొన్న పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్, పేసర్ మొహమ్మద్ ఆసిఫ్ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టి సత్తా చాటుకున్నారు. ఇటీవలే వీరి సస్పెన్షన్ కాలం ముగియడంతో పాక్ జాతీయ వన్డే కాంపిటీషన్‌లో పాల్గొన్నారు. ఆదివారం డబ్ల్యుఏపీడీఏ జట్టు తరఫున బరిలోకి దిగిన భట్ సెంచరీ (143 బంతుల్లో 135; 14 ఫోర్లు)తో అదరగొట్టగా ఇదే జట్టుకు ఆడుతున్న ఆసిఫ్ బౌలింగ్‌లో ఆరు ఓవర్లలో 23 పరుగులకు రెండు వికెట్లు తీశాడు. 2010 ఇంగ్లండ్ పర్యటనలో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన భట్, ఆసిఫ్, ఆమిర్ త్రయం స్వల్పకాలం జైలు కెళ్లడంతో పాటు ఐదేళ్ల నిషేధాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. గత సెప్టెంబర్‌లో వీరిపై నిషేధం ముగిసినా పునరావాస శిబిరంలో చేరారు.