ఆసిఫాబాద్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జాతీయ రహదారి నెత్తురోడింది. జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ చెక్‌పోస్టు సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాగజ్‌నగర్ మండలం బట్టుపెల్లికి చెందిన తల్లి, కొడుకు సహెరాభాను(35), షేక్ ఆసిఫ్(16) దుర్మరణం చెందారు. తండ్రి సర్వర్ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. సర్వర్ తన భార్య, కుమారుడితో కలసి శనివారం ఆసిఫాబాద్ మండలం చిర్రకుంటలోని బంధువుల ఇంటికి వెళ్లాడు.
ఆదివారం ఉదయం మోటార్‌సైకిల్‌పై తిరిగి బట్టుపెల్లికి బయల్దేరారు. జాతీయ రహదారి ఎగ్జిట్ రోడ్డు వద్ద యూటర్న్ తీసుకుంటున్న ఓ కంటైనర్ లారీ.. సర్వర్ మోటార్‌సైకిల్‌పై నుంచి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో కంటైనర్ వెనక టైర్ కిందికి వచ్చిన తల్లి, కొడుకులు అక్కడికక్కడే మృతిచెందారు. సర్వర్ తీవ్రంగా గాయపడ్డాడు.
కాగా, బైక్‌పై నుంచి దూసుకెళ్లిన కంటెయినర్ లారీ ఎదురుగా వస్తున్న మరో లారీని కూడా ఢీకొట్టింది. దీంతో ఆ లారీ డ్రైవర్, క్లీనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను నేషనల్ హైవేకు చెందిన 1033 వాహనంలో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృత దేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్సైలు మహేందర్, ప్రవీణ్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
ఎగ్జిట్ దారి మూసి వేయాలని ధర్నా..
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని రాజంపేట చెక్‌పోస్టు మీదుగా జాతీయ రహదారికి వెళ్లే మార్గాన్ని మూసి వేయాలని స్థానికులు ప్రమాదస్థలం వద్ద నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని గుండి రహదారి.. ఆపై సర్విస్ రోడ్డు మీదుగా జాతీయ రహదారిపైకి వాహనాలు వెళ్లే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment